విడుదల తేదీ : మార్చి 14, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : శివాజీ, ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్లా తదితరులు.
దర్శకుడు : రామ్ జగదీష్
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
సంగీతం :విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ :దినేష్ పురుషోత్తమన్
ఎడిటర్ :కార్తీక శ్రీనివాస్ ఆర్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’ కాగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
మంగపతి (శివాజీ) పరువే ప్రాణంగా బతికే వ్యక్తి. అతని కుటుంబానికి చెందిన జాబిలీ (శ్రీదేవి అపల్లా)ని చందు (హర్ష రోషన్) ప్రేమిస్తాడు. చందు పేదవాడు. అయినప్పటికీ, జాబిలీ కూడా అతన్ని ప్రేమిస్తోంది. అయితే, ఆమె మైనర్. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంగపతి ఈ విషయాన్ని పెద్దది చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చందు పై ‘ఫోక్సో’ వంటి భయంకరమైన సెక్షన్లతో కేసులు పెట్టి ఇరికించేలా చేస్తాడు మంగపతి. పేద కుటుంబంలో పుట్టిన చందుకి న్యాయం చేయడానికి ఏ లాయర్ ముందుకు రారు. వచ్చినా.. మంగపతి లంచంతో కొనేస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసును జూనియర్ లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి) వాదిస్తాడు. మరి చందుని నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి సూర్య తేజ ఏం చేశాడు ?. ఎలాంటి వాదన చేశాడు ?, ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మెయిన్ థీమ్, అలాగే టీనేజ్ లో పుట్టే తొలిప్రేమ తాలూకు కష్టనష్టాలు, ఇక పేదవాళ్ళకి ఈరోజుల్లో న్యాయం జరగడం లేదు’ అనే కోణం.. వీటి మధ్య మంగపతి లాంటి బలమైన పాత్రలు.. వాటి సంఘర్షణలు.. మొత్తంగా ఈ కోర్ట్ సినిమా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు శివాజీ నటన ప్రధాన బలం. మంగపతిగా శివాజీ తన పాత్రలో జీవించాడు. లాయర్ సూర్యతేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తన పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు.
అలాగే, కుర్రాడి పాత్రలో నటించిన హర్ష రోషన్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇక కొడుకు కోసం నిస్సహాయ స్థితిలో ఉండిపోయే పేరెంట్స్ గా నటించిన చందు పేరెంట్స్ (నటీనటులు) కూడా చాలా బాగా నటించారు. వారి ఎమోషన్స్ ను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. అదే విధంగా నటి రోహిణి తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. కోర్టు హాలు సన్నివేశాలన్నీ చాలా గ్రిప్పింగ్‌గా చూపించారు. మిగతా నటీనటులు చాలా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ముఖ్యంగా దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్టు ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్ మధ్య సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే, టీనేజ్ ప్రేమను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేమ సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. శివాజీ టైమింగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది.
మైనస్ పాయింట్స్:
ఈ కోర్ట్ సినిమాలో మంచి మెసేజ్ ఉన్నా.. కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. అదేవిధంగా సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ ను సాగదీయకుండా కుదించి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. పైగా రెగ్యులర్ కోర్ట్ స్టోరీ ట్రీట్మెంట్ తోనే సినిమాని నడపడం, ప్రధానంగా శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్ ను బలంగా ముగించకపోవడం బాగాలేదు.
సాంకేతిక విభాగం :
సినిమాలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మరియు మెసేజ్ చాలా బాగుంది. కథనం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇక సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాత ప్రశాంతి తిపిర్నేని పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘కోర్ట్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాలో.. మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ఫోక్సోకి సంబంధించిన ఓ మంచి మెసేజ్ కూడా ఉంది. అలాగే, కొన్ని బలమైన కోర్ట్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఐతే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గానే అనిపిస్తాయి. కానీ, సినిమాలో ప్రధాన డ్రామా, మరియు ‘శివాజీ – ప్రియదర్శి’ల నటన సినిమా స్థాయిని పెంచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా అలరిస్తోంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team