నాని స్టామినా ఏమిటో మరోసారి రుజువైంది !
Published on Sep 24, 2016 5:01 pm IST

nani-majnu
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. తన సహజ నటనతో సాధారణ స్థాయి నుండి హీరోగా అనూహ్యమైన స్థాయికి ఎదిగాడు నాని. ఈ సంవత్సరం వరుసగా రెండు సూపర్ హిట్లు అందుకున్న ఆయన మూడో చిత్రం ‘మజ్ను’ నిన్ననే విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ ఓపెనింగ్స్ వచ్చింది మామూలు రోజుల్లో అయితే పెద్ద విశేషమేమీ ఉండేది కాదు. కానీ తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న సమయంలో ఇంత మంచి కలెక్షన్లు రావడమంటే కాస్త పెద్ద విషయమే.

విభిన్నమైన, సరికొత్త తరహా కథలను ఎంచుకుని సినిమాలు చేయడం, నటుడిగా పూర్తి స్థాయి పరిణితి చూపడం వంటి వాటి వల్ల చాలా మంది సినీ ప్రేమికులకు నాని సినిమా అంటే ఖచ్చితంగా చూడదగ్గదేనన్న నమ్మకం ఏర్పడిపోయింది. అందుకే వర్షాలను సైతం లెక్కచేయకుండా జనాలు నాని సినిమా కోసం థియేటర్లకు క్యూలు కట్టారు. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న వివరాల ప్రకారం ఈ చిత్రం నైజాం లో రూ. 1.04 కోట్లు, సీడెడ్ లో రూ. 35 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 34 లక్షలు, ఈస్ట్, వెస్ట్ గోదావరిల్లో కలిపి రూ.38 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ.11 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు కలిపి మొత్తం ఎపి, తెలంగాణాల్లో సుమారు రూ. 2.51 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. దీంతో బాక్సాఫీస్ ముందు నాని స్టామినా ఏమిటో మరోసారి రుజువైంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook