‘బాహుబలి’ తరువాతి పోస్టర్ ఎప్పుడు?

‘బాహుబలి’ తరువాతి పోస్టర్ ఎప్పుడు?

Published on May 14, 2015 1:10 PM IST

Baahubali
దర్శకుడు రాజమౌళికి ప్రమోషనల్ కార్యక్రమాల్లో కొత్త పంథాను సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. ‘మగధీర’ సినిమా నుంచి ఈ తరహా ప్రమోషన్లతో సినిమాపై క్రేజ్‌ను అమాంతం పెంచేసే టెక్నిక్‌ను వాడుకుంటూ వస్తున్నారు రాజమౌళి. తాజాగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు కూడా ఇప్పట్నుంచే సరికొత్త ప్రమోషన్‌కు శ్రీకారం చుట్టారు. బాహుబలి సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు ఉన్నందున ఈ సమయంలో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చడానికి బాహుబలి టీమ్ సరికొత్త ప్రణాళికలు రూపొందించింది.

‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మే 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈలోగా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్తేజాన్ని పెంచడానికి సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన వారి పోస్టర్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బాహుబలి ఫస్ట్‌లుక్ పోస్టర్, శివుడు పాత్రలో నటించిన ప్రభాస్ పోస్టర్, దేవసాన పాత్రలో నటించిన అనుష్క పోస్టర్‌, శివగామిగా నటించిన రమ్యకృష్ణ పోస్టర్‌, కాళకేయగా నటించిన ప్రభాకర్ పోస్టర్, బిజ్జలదేవగా నటించిన నాజర్ పోస్టర్ ఇలా ఒక్కో పోస్టర్‌తో సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేశారు. తాజాగా ఈ వరుసలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ పోస్టర్‌ను రేపు (మే 15న) విడుదల చేయనున్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను మే 31న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు