పుష్యం ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో, స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం “దేవగుడి”. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మరియు మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గార్ల చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ చిత్రంలో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మీకాంత్ కనికే డీఓపీగా, షేక్ మదీన్ సంగీత దర్శకుడిగా, నాగిరెడ్డి ఎడిటర్‌గా పనిచేశారు.
దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “ప్రజా సేవలో బిజీగా ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా నాయకుల నిబద్ధతను ప్రేరణగా తీసుకుని ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా రూపొందించాం. ప్రేక్షకుల ఆదరణ కోరుకుంటున్నాను” అని అన్నారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ సినిమా ద్వారా చిత్ర బృందం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా కడప మాండలికంలో ఈ సినిమా ఉండటం నాకు ఆనందాన్ని ఇచ్చింది” అని అన్నారు.
విప్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, “దర్శక నిర్మాత రామకృష్ణారెడ్డి గారు నాకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి. మా ఊరు పేరుతో ఈ సినిమా టైటిల్ పెట్టడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించి, ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు.


