ధనుష్ కేసు విషయంలో పెరుగుతున్న ఉద్రిక్తత !

21st, March 2017 - 10:30:12 AM


మధురైకి చెందిన వృద్ధ దంపతులు కార్తిరేసన్, మీనాక్షిలు ధనుష్ తమ మూడవ సంతానమని, చదువుకునే వయసులో సినిమాలాంటే ఇష్టంతో ఇంటి నుంచి పారిపోయాడని, అతను హీరో అయ్యాకే అతని జాడ తెలిసిందని, కనుక అతను తమ జీవన బృతికి ప్రతి నెల రూ .60,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రితం వాయిదాలో ధనుష్ యొక్క పుట్టుమచ్చలను పరిశీలించిన వైద్యులు తన రిపోర్ట్స్ ను కోర్టువారికి అందించారు. నిన్న ఆ రిపోర్ట్స్ ను పరిశీలనకు రావడంతో కేసులో మరింత ఉత్కంఠ చోటు చేసుకుంది.

కార్తిరేసన్, మీనాక్షి దంపతులు తమ వాదనలో ధనుష్ యొక్క భుజపుటెముక మీద ఒక పుట్టుమచ్చ, మోచేతి మీద ఒక పెద్ద గుర్తు ఉండాలని తెలపగా వైద్యుల పరిశీలనలో అలాంటివేమీ లేవని తేలింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా చిన్నపాటి పుట్టుమచ్చను లేజర్ ట్రీట్మెంట్ ద్వారా, పెద్ద మచ్చను పిలాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించవచ్చని అంతేగాక ధనుష్ శరీరంపై లేజర్ ద్వారా పుట్టుమచ్చలు తొలగించిన ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు తెలపడంతో గందరగోళం నెలకొంది.

కార్తిరేసన్ దంపతుల తరపు న్యాయవాది డాక్టర్ల రిపోర్ట్స్ కాపీ తమ వద్ద ఉందని, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ధనుష్ పుట్టుమచ్చలు తొలగించారని అన్నారు. కోర్టు మాత్రం దీనిపై సమగ్ర స్టాయి విచారణ జరిపి మార్చి 27 నాటికి రిపోర్ట్స్ అందివ్వాలని ఆదేశించింది. ఈ ఉత్కంఠ పరిణామంతో చివరికి ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడుతుందో చూడాలని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.