టాలీవుడ్‌లో ‘సెకండ్ హ్యాండ్’, ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఇటీవల రవితేజ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన కెరీర్ బ్లాక్‌బస్టర్ ‘నేను శైలజ’ సినిమా సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
తన సినిమాలన్నింటిలో ‘నేను శైలజ’ తనకు అత్యంత ఇష్టమైన చిత్రమని కిషోర్ తిరుమల తెలిపారు. అయితే, ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తాను కీర్తి సురేష్‌ను అనుకోగా, నిర్మాతలు మాత్రం ఒక స్టార్ హీరోయిన్‌కు కథ వినిపించమని కోరారట. కానీ, ఆ పాత్రలోని అమాయకత్వాన్ని పండించడానికి కీర్తి సురేష్ అయితేనే కరెక్ట్ అని ఆయన బలంగా నమ్మారు. దీంతో ఆ టాప్ హీరోయిన్ ఆ సినిమాను రిజెక్ట్ చేసేలా ప్లాన్ చేశానని ఆయన నవ్వుతూ వెల్లడించారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆ హీరోయిన్‌కు కథ వినిపించిన కిషోర్ తిరుమల, ఆమెకు నచ్చని విధంగా వెర్షన్‌ను నేరేట్ చేశారట. ఫలితంగా ఆమె ఆ సినిమాను తిరస్కరించడంతో, లోలోపల సంతోషపడి ఆమెకు ‘థాంక్యూ’ చెప్పి మరీ బయటకు వచ్చేశారట. ఆ తర్వాత వెంటనే కీర్తి సురేష్‌ను ఫైనల్ చేసి సినిమాను పట్టాలెక్కించారు. అయితే ఆ టాప్ హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం దర్శకుడు బయటపెట్టలేదు.


