హీరోలకు పోటీగా దర్శకులొస్తున్నారు…!

Published on Oct 9, 2019 3:25 pm IST

మొన్న తరుణ్ భాస్కర్ నిన్న వివి వినాయక్ లు దర్శకుల నుండి హీరోలుగా అవతారం ఎత్తారు. దర్శకులుగా తమ సత్తా చాటిన వీరు హీరోలుగా కూడా మేమేమిటో నిరూపిస్తాం అని ముఖాలకు మేకప్ వేసుకున్నారు. తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా అని వస్తుంటే, వివి వినాయక్ సీనయ్య అనే మెకానిక్ గెటప్ లో కిక్ ఇచ్చాడు. ఈ దర్శకులిద్దరూ హీరోలకు పోటీగా వస్తున్నారు.

దర్శకుడు వివి వినాయక్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు. మొదటి చిత్రం ఆది తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వినాయక్ చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, లక్ష్మి, కృష్ణ, అదుర్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించి టాప్ మాస్ డైరెక్టర్ గా, స్టార్ హీరోల మొదటి ఛాయిస్ గా కొనసాగారు. ఇక తరుణ్ భాస్కర్ అప్ కమింగ్ డైరెక్టర్ అయినప్పటికీ మొదటి చిత్రం పెళ్ళిచూపులతో జాతీయ అవార్డు గెలిచిన చిత్ర దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఈ యంగ్ టాలెంట్ డైరెక్టర్ ని విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి,హీరోని చేశాడు. ఈయన నటించిన మీకు మాత్రమే చెప్తా నవంబర్ 1న విడుదల కానుంది.

ఒక టాప్ మాస్ డైరెక్టర్ మరియు ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ఈ ఏడాది హీరోలుగా కొత్త దారిలో ప్రయాణం మొదలుపెట్టారు. నిజానికి ఈ సాంప్రదాయం కొత్తదేమీ కాదు, దాసరి నారాయణ రావు దర్శకుడైనప్పటికీ ఆయన ప్రధాన పాత్రలో చాలా సినిమాలు చేశారు, అలాగే మరో దర్శకుడు బహుముఖ ప్రజ్ఞా శాలి ఎస్ వి కృష్ణారెడ్డి ఉగాది, అభిషేకం వంటి చిత్రాలలో హీరోగా చేయడం జరిగింది. ఇలా దర్శకులు హీరోలుగా మారుతూ హీరో కావాలని ఆశపడుతున్న వారికి పోటీ ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More