సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్లపై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత నిఖిల్ ఎం. గౌడ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ ఆసక్తితోనే చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని ఆయన తెలిపారు.
దర్శకుడు చిన్మయ్ రామ్ చెప్పిన కథలోని కొత్తదనం, వైవిధ్యమైన కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాను నిర్మించినట్లు నిఖిల్ పేర్కొన్నారు. కర్ణాటక, ఆంధ్రా సరిహద్దుల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. కథ విన్నప్పుడు కలిగిన ఉత్కంఠ, తెరపై సినిమా చూస్తున్నప్పుడు కూడా కలిగిందని, ప్రేక్షకులను భయపెట్టే అంశాలతో పాటు ఒక కొత్త ప్రపంచాన్ని ఈ సినిమా పరిచయం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అలెక్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సునీల్ హొన్నలి విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, ఇవి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తాయని చెప్పారు. అమిత్ రావ్, పర్వేజ్ సింబా, సంగీత తదితరులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని కొనియాడారు. భవిష్యత్తులో తెలుగు, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు నిర్మిస్తానని నిఖిల్ ఎం. గౌడ స్పష్టం చేశారు.


