ఆ పుకార్లను నమ్మకండి : అంజలి

ఆ పుకార్లను నమ్మకండి : అంజలి

Published on May 16, 2015 12:45 PM IST

Anjali
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి సినిమాలతో తెలుగునాట అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది అంజలి. ఆ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఆ తర్వాత అంజలికి తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. పూర్తిగా హైద్రాబాద్‌కి మకాం మార్చేసిన అంజలి, షూటింగ్ కోసం చెన్నై-హైద్రాబాద్‌ల మధ్య చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య కాలంలో అంజలిపై తమిళ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. అంజలికి పెళ్ళైందని, షూటింగ్‌లో పాల్గొనకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతోందని వార్తలొచ్చాయి.

తాజాగా ఈ పుకార్లన్నింటిని అంజలి కొట్టిపారేసింది. “ఇలా అర్థం పర్థం లేని పుకార్లను ఎందుకు పుట్టిస్తారో నాకు అర్థం కాదు. నిజంగానే నేను షూటింగ్‌కు రాకుండా ఇబ్బందులు పెడితే నిర్మాతలు ఇలా ఊరుకోరు కదా! చాలా హ్యాపీగా నేనిచ్చిన డేట్స్ ప్రకారమే షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇకపోతే నాకు పెళ్ళైందని, ఓ పాప కూడా ఉందని వార్తలొచ్చాయి. ఇలాంటివి చూస్తే నవ్వొస్తుంది. నా మేనకోడలితో కలిసి ఎప్పుడో దిగిన ఓ ఫోటోను పట్టుకొని తను నా పాపని, నాకు పెళ్ళైందని పుకారు పుట్టించారు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని అందరినీ కోరుకుంటున్నా” అంటూ ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజలి స్పష్టం చేసింది.

తాజా వార్తలు