దేవీశ్రీ ప్రసాద్.. పాటల రచయితగానూ సమర్ధుడే!

దేవీశ్రీ ప్రసాద్.. పాటల రచయితగానూ సమర్ధుడే!

Published on Mar 16, 2015 6:52 PM IST

Devi-Sri-Prasad
నిన్న సాయంత్రం అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాకి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక జరిగింది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆల్బ‌మ్‌లోని ఒక్కో పాట విడుదలవుతుండగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక చివరి పాట లాంచ్‌కి మాత్రం ఏకంగా దేవీయే రంగంలోకి దిగాడు. తన స్టైల్ ఎక్స్‌ప్రెషన్‌తో, డ్యాన్సులతో, తనకు అలవోకగా మారిపోయిన ఫీట్‌ను మళ్ళీ చేసి చూపించాడు. అప్పటివరకూ కేవలం సంబరాల్లో ఉన్న అభిమానులు, ఆ చివరి పాటతో కేరింతలతో దుమ్మురేపారు. ప్రతిసారీ ఏదో మంత్రం చేస్తూ ఇలాగే చివర్లో వచ్చి కేక పుట్టిస్తాడీ యువ సంగీత దర్శకుడు.

ఒకే వ్యక్తి.. ట్యూన్స్‌తో అదరగొడతాడు, పాటతో కేక పుట్టిస్తాడు, డ్యాన్స్‌తో చిందులు వేయిస్తాడు, చివరకు రాతతోనూ ఈలలు వేయిస్తాడు. అవును.. మనం కొన్ని పాటలను గుర్తించకపోయినా, అది దేవీశ్రీ ప్రసాద్ రాశాడనగానే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటివరకూ పదికి పైగానే పాటలు రాసిన దేవిశ్రీ ప్రసాద్, అన్ని పాటల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆనందంతో మొదలైన ఈ ‘రాత’ ప్రస్థానం.. సన్నాఫ్ సత్యమూర్తి వరకూ కొనసాగుతూ వచ్చింది. ఇప్పటివరకూ ఒక్కో పాటకే పరిమితమైన దేవీ, సన్నాఫ్ సత్యమూర్తిలో ఏకంగా మూడు పాటలను రాశాడు. విశేషమేమిటంటే.. దేవీశ్రీ ప్రసాద్ రాసిన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలబడడమే కాక, ఇప్పటికీ శ్రోతల నోళ్ళల్లో నానుతూ ఉండడం. గబ్బర్ సింగ్‌లోని ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ పాట దేవీ రాసిన పాటల్లో నెంబర్ వన్‌గా నిలబడగా, అత్తారింటికి దారేది సినిమాలోని ‘నిన్ను చూడగానే..’ కూడా అదే స్థాయి ఆదరణ పొందింది. ఇప్పుడిక సన్నాఫ్ సత్యమూర్తిలోని పాటలు ఏ స్థాయి ఆదరణ పొందుతాయనేది.. చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు