సమీక్ష : ‘ఎంతవారలైనా’ – బోరింగ్ క్రైమ్ హారర్ డ్రామా !

Published on May 18, 2019 3:58 am IST

Release date :
విడుదల తేదీ : మే 17, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, జి. సీతారెడ్డి తదితరులు..

దర్శకత్వం : గురు చిందేపల్లి

నిర్మాత : జి.సీతారెడ్డి.

సంగీతం : సుక్కు

సినిమాటోగ్రఫర్ : ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి

ఎడిటర్ :  వి.నాగిరెడ్డి

గురు చిందేపల్లి దర్శకత్వంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌ హీరో హీరోయిన్లుగా వచ్చిన థ్రిల్లింగ్‌ హారర్‌ ‘ఎంతవారలైనా’. జి.సీతారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

కృష్ణ (అద్వైత్‌) సిన్సియర్ పొలీస్ ఆఫీసర్. అయితే అద్వైత్‌ స్టేషన్ పరిధిలోనే ఓ ఇద్దరు క్రిమినల్స్ డబ్బులు కోసం ఒంటరిగా కనబడిన వ్యక్తులను చంపుతూ వారి దగ్గర నుండి డబ్బులు కాజేస్తుంటారు. దాంతో అద్వైత్‌ ఈ కేసును సీరియస్ గా హ్యాండిల్ చేసి.. వాళ్లను పట్టుకుని అరెస్ట్ చేస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా కృష్ణ యస్.ఐ పోస్ట్ నుండి సస్పెండ్ అవుతాడు. కృష్ణ ప్లేస్ లోనే యస్.ఐ గా వస్తోంది శైలు (జహీదా శ్యామ్). ఇద్దరు మధ్య జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు క్రిమినల్స్ వెనుక ఎవరో ఉన్నారని తెలుస్తోంది. అసలు ఆ క్రిమినల్స్ ను నడిపిస్తోన్న వ్యక్తీ ఎవరు ? హీరో అతన్ని ఎలా పట్టుకోగలిగాడు ? ఈ క్రమంలో హీరోకి హీరోయిన్ ఎలాంటి సహాయసహకారాలు అందించింది ?
లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో యస్.ఐగా నటించిన హీరో అద్వైత్‌ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా చాలా వరకు కాన్ఫిడెంట్ గా నటించాడు. తన నటనతోనే కాకుండా డైలాగ్ మాడ్యులేషన్ తో కూడా అద్వైత్‌ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ గా నటించిన జహీదా శ్యామ్ తన గ్లామర్ తోనే కాకుండా.. తన లుక్స్ పరంగా, అలాగే తన నటన పరంగా కూడా బాగానే ఆకట్టుకుంది.

ఇక విలన్స్ గా నటించిన అలోక్‌ జైన్‌, జి. సీతారెడ్డి తమ నటనతో విలనిజాన్ని బాగానే పండించారు. ముఖ్యంగా అలోక్‌ జైన్‌ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. మెయిన్ గా మర్డర్స్ చేసే సీన్స్ లో తన మ్యానరిజమ్స్ తో సినిమాలో సీరియస్ నెస్ తీసుకొచ్చాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. తప్పు చేస్తే.. ‘ఎంతవారలైనా’ శిక్షార్హులే అని
సినిమాలో చెప్పాలనుకున్న మెసేజ్ బాగుంది. అలాగే సంగీత దర్శకుడు సుక్కు అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.

మైనస్ పాయింట్స్ :

క్రైమ్ కి సంబంధించి మంచి కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు గురు చిందేపల్లి, ఆ కాన్సెప్ట్ ను అంతే బాగా తెర మీదకు ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్‌ ను కథకు అవసరం లేని సీన్లతో అనవసరమైన సాంగ్ లతో నడిపితేే, సెకెండ్ హాఫ్ ను సాగతీత సన్నివేశాలతో, పండిన ఎమోషనల్ సన్నివేశాలతో సాగ తీస్తూ.. హార్రర్ టచ్ ఇస్తూ సినిమాను ముగించాడు.

ప్రధానంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కథకు సంబంధించిన సన్నివేశాలు కూడా, ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించవు. ముఖ్యంగా కథలోని మెయిన్ సంఘర్షణ బలంగా లేకపోవడం , పైగా పాత్రల మధ్య నడిచే డ్రామా కూడా బోర్ గా సాగడంతో.. సినిమా ఫలితం దెబ్బ తింది. ఇక హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా మరీ బలహీనంగా ఉన్నాయి. దాంతో సినిమాలో సీరియస్ నెస్ బాగా మిస్ అయింది.

అలాగే ప్రీ క్లైమాక్స్ లో దర్శకుడు గురు చిందేపల్లి అనవసరంగా హార్రర్ ఎలిమెంట్స్ ను ఇరికించారు. దాంతో కథ డైవర్ట్ అవుతుంది. ఓవరాల్ గా దర్శకుడు స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహించి ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు గురు చిందేపల్లి క్రైమ్ కు సంబంధించి మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికి.. దాన్ని తెర మీద చూపెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ బాగున్నాయి. సుక్కు అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. ఒక పాట మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటర్ పనితనం పర్వాలేదు. నిర్మాత జి.సీతారెడ్డి చిత్రం పై బాగానే ఖర్చు పెట్టారు.

తీర్పు :

గురు చిందేపల్లి దర్శకత్వంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రైమ్ హారర్‌
థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. ఆకట్టుకోని కథకథనాలు, మెప్పించలేకపోయిన దర్శకత్వ పనితనం, ఆసక్తిగా సాగని సన్నివేశాలు.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రేక్షకుడ్ని ఆకట్టుకోలేకపోయింది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

 

Click here for English Review

సంబంధిత సమాచారం :

More