సురేష్ బాబే అంత మాట అంటే.. పరిస్థితి అంత దారుణంగా ఉందో !

Published on Nov 17, 2019 8:01 pm IST

తెలుగు పరిశ్రమలోని అగ్ర నిర్మాతల జాబితా తీస్తే మొదట గుర్తొచ్చే పేరు సురేష్ బాబు. తండ్రి రామానాయుడు పరంపరను కొనసాగిస్తూ ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత ఆయన. కేవలం నిర్మాణంలోనే కాదు డిస్ట్రిబ్యూషన్ రంగంలో సైతం అగ్రగామి. అలాంటి సురేష్ బాబు తన బిజినెస్ దారుణమైన పరిస్థితిలో ఉందనడం ప్రజెంట్ ఇండస్ట్రీ కష్టాల్లో ఉందని హెచ్చరించడమే అనుకోవాలి.

డిజిటల్ స్ట్రీమింగ్ వలన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారన్నది అందరికీ తెలిసిన సంగతే. కానీ ఆ ఇబ్బంది సురేష్ బాబు లాంటి నిర్మాత తన థియేటర్లకు కనీసం కరెంట్ బిల్ కూడా చెల్లించడానికి కష్టపడేలా ఉందనడమే ఆందోళన కలిగిస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలకు రెండు నెలల గడువు పెట్టినా ఇబ్బంది తీరదని, మంచి సినిమాలు తక్కువయ్యాయని, జనాన్ని సినిమా హళ్లకు రప్పించడమే కష్టంగా మారిందని ఆయన చెబుతున్నారు.

నిజమే.. సురేష్ బాబు చెప్పిన ప్రతి మాట వాస్తవం. మంచి సినిమాలు తగ్గడం, డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల పోటీ అన్నీ కలిసి నిర్మాతలకు, పంపిణీదారులకు కష్టాల్ని తెచ్చిపెట్టాయి. ఈ కష్టాలకు సురేష్ బాబు లాంటి బడా వ్యాపారవేత్తలే కదిలిపోతున్నారంటే మధ్య తరహా, చిన్నా చితకా డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఇంకెంత క్లిష్టంగా ఉందో మరి.

సంబంధిత సమాచారం :