ఇంటర్వ్యూ – వివేక్ సాగర్ – నేను కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ని కాను !
Published on Sep 7, 2017 2:00 pm IST

వివేక్ సాగర్, ‘పెళ్లి చూపులు’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమై, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘యుద్ధం శరణం’ అతని రెండో చిత్రం. రేపు ఆ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా వివేక్ సాగర్ తో ముచ్చటించడం జరిగింది. ఆ సంగతులు మీకోసం…..

ప్ర) ‘పెళ్లి చూపులు’ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించారా?

జ) లేదు. ఆ స్క్రిప్ట్ పై నమ్మకంతో పని చేశాను. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి చాలా రోజులు పట్టింది. సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఈ సినిమా వల్ల ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేశారు. ఇంతకంటే ఎం కావాలి.

ప్ర) సంగీతం పరంగా ‘పెళ్లి చూపులు’,’యుద్ధం శరణం’ మధ్య తేడాలేమైనా చూపించారా?

జ) ‘యుద్ధం శరణం’ కు పూర్తిగా డిఫరెంట్ సెటప్ లో సంగీతాన్నందించా. ఇందులో స్క్రీన్ ప్లే ఆధారంగా సంగీతం ఉంటుంది. సన్నివేశాన్ని, సందర్భాన్ని బట్టే పాటలు ఉంటాయి.

ప్ర) మళ్ళీ కొత్త దర్శకుడితో పనిచేయడం ఎలా ఉంది?

జ) కృష్ణతో పని చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. మేమిద్దరం మ్యూజిక్ కి సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. ఈ సినిమాలో ఎక్కువగా రియలిస్టిక్ గా వచ్చే సంగీతాన్నే వాడాం.

ప్ర) మీరు సినిమా ఆల్బం ని ఎలా తయారు చేస్తారు?

జ) డైరెక్టర్ దృష్ట్యా నేను ఆలోచిస్తాను. అతని మైండ్ లో ఏమనుకుంటున్నాడో దానికి ప్రాముఖ్యత ఇస్తాను. ఎప్పటికప్పుడు అతనితో చర్చిస్తాను. తనకి ఎలాంటి మ్యూజిక్ కావాలో కనుక్కుని, అన్నీ ఆలోచించి అలోచించి, ఆయనకు కూడా కొన్ని ఆప్షన్స్ ఇచ్చి తననే సెలెక్ట్ చేసుకోమని చెప్తాను.

ప్ర) నేటి కమర్షియల్ మ్యూజిక్ పై మీ అభిప్రాయం?

జ) నేను క్లియర్ గా చెప్తున్నా.. కమర్షియల్ సంగీతం అనేది ఎక్కువ కాలం ఉండదు. సంగీతం అనేది కథని బట్టి ఉండాలి అంతేగాని ఎప్పుడూ ఇలా కమర్షియల్ పోకడలు పోకూడదు. నాణ్యమైన సంగీతాన్ని అందించేవాళ్ళు తొందరగా వాళ్ళ ఉనికిని చాటుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. నేను మాత్రం కమర్షియల్ మ్యూజిక్ కి సంబంధించిన వాడిని కాదు.

ప్ర) ‘పెళ్లి చూపులు’ లాంటి విజయం తర్వాత కూడా మీరు ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం?

జ) నేను ‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత నాలుగైదు సినిమాలకు ఈజీగా సంతకం చేసి నాకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేవాడ్ని. కాని నేను నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. అందుకే నాణ్యమైన కంటెంట్ ను ఎంచుకుంటున్నాను.

ప్ర) ఒకవేళ కమర్షియల్ మూవీ చేయమని ఎవరైనా అడిగితే చేస్తారా?

జ) చేయను. ఆ అవకాశాన్ని నేను తిరస్కరిస్తాను. 90% సంగీత దర్శకులు కమర్షియల్ మ్యూజిక్ నే అందిస్తున్నారన్నది నా భావన. ఒక 10% అయినా ఉత్తమమైన మ్యూజిక్ ఇవ్వాలనుకుంటున్నాను. కొంత సమయం వృధా అయినా నాణ్యమైన మ్యూజిక్ నే అందిస్తాను.

ప్ర) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?

జ) మళ్ళీ ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ విజయ్ భాస్కర్ తోనే చేస్తున్నాను. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.

 
Like us on Facebook