సినిమాని పరుగులు పెట్టిస్తున్న బాలయ్య, పూరి !


నందమూరి బాలకృష్ణ తన 101వ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అస్సలు ఊహించని వీరిద్దరి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సినిమా విడుదల కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పూరి, బాలయ్యలు కూడా ముందుగా అనౌన్స్ చేసిన తేదీ సెప్టెంబర్ 29న చిత్రాన్ని విడుదల చేయడం కోసం చాలా వేగంగా పనిచేస్తున్నారు.

మార్చి మూడవ వారంలో మొదలైన ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. ఈ 2వ షెడ్యూల్లోనే కోటి రూపాయల ఖర్చుతో ఒక పాటను చిత్రీకరించారు. ఇక 3వ షెడ్యూల్ కోసం యూనిట్ మొత్తం 11వ తేదీన పోర్చుగల్ వెళ్లనుంది. అక్కడే మూడు పాటలను, కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని, ఇతర కీలక సీన్లను చిత్రీకరించనున్నారు. 40 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ అనంతరం జూన్ నెలాఖరున 10 రోజుల ఆఖరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. అది పూర్తయితే చిత్రీకరణ ముగిసినట్టేనట. ఇలా బాలయ్య. పూరిలు విడుదల విషయాల్లో అభిమానులకు నిరుత్సాహం కలగకుండా ఉండేందుకు సినిమా పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారు.