ఇంటర్వ్యూ : ఫైట్ మాస్టర్ రామకృష్ణ – పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం.

Published on Feb 20, 2019 6:04 pm IST

తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో ఫైట్ మాస్టర్ల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి సినిమాల్లో యాక్షన్ అంశాలు ఓ స్థాయిలో ఉంటున్నాయంటే.. దానికి కారణం ఇప్పటితరం ఫైట్ మాస్టర్లే. అలాంటి ఫైట్ మాస్టరే రామకృష్ణ. తన ప్రతిభతో చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు ఆయన.

కాగా ఇప్పటివరకూ రామకృష్ణ ‘కృష్ణార్జున యుద్ధం’, హలో గురు ప్రేమ కోసమే, రాజా ది గ్రేట్ లాంటి చిత్రాలకు పనిచేశారు. ప్రస్తుతం మజిలీ, వెంకీ మామ, జెర్సీ లాంటి చిత్రాలకు పని చేస్తున్నారు. కాగా ఈ సందర్భంగా రామకృష్ణ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన సినీ పయనాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

ఫైట్స్ అంటేనే ఎంతో రిస్క్ తో కూడుకున్న విషయం. అసలు మీరు ఫైట్ మాస్టర్ అవ్వాలని ఏ స్టేజ్ లో నిర్ణయించుకున్నారు ? ఆ నిర్ణయానికి గల కారణాల గురించి చెప్పండి ?

నాకు చిన్నప్పటినుంచీ ఫైట్స్ అంటే ఎక్కువ ఆసక్తి అండి. దానికి తోడు ఏలూరులో మా గురువుగారు సూర్యనారాయణగారి దగ్గర ఒక ఎనిమిది సంవత్సరాలు ఫైట్స్ లో అన్ని మెళుకువులు, అలాగే కరాటీ కూడా నేర్చుకున్నాను. ఆ తరువాత ఆయనే నన్ను ‘రామ్ ల‌క్ష్మ‌ణ్‌’ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పెట్టారు.

‘రామ్ ల‌క్ష్మ‌ణ్‌’ మాస్టర్స్ దగ్గర ఎన్ని సంవత్సరాలు పని చేశారు. వాళ్ళ దగ్గర మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి ?

“నేను ‘రామ్ ల‌క్ష్మ‌ణ్‌’ మాస్టర్స్ దగ్గర సింహా సినిమా నుండి అసిస్టెంట్ గా పని చేశాను. దాదాపు ఆరు సంవత్సరాలు మాస్టర్స్ దగ్గరే పని చేశాను. ఇక మాస్టర్స్ దగ్గర ఎక్స్ పీరియన్స్ అంటే.. వాళ్ళ నుండి నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. అలాగే మాస్టర్స్ కూడా నన్ను అన్ని విధాలుగా చాలా బాగా ప్రోత్సహించారు.

మీరు ఫైట్ మాస్టర్ గా ఎప్పుడు మారారు. మీ మొదటి సినిమా ఏది ?

అల్లు శిరీష్ గారి ‘ఒక్క క్షణం’ సినిమాతోనే నేను ఫైట్ మాస్టర్ గా మారాను. అలాగే ‘జై లవ కుశ’లో కూడా ఒక ఫైట్ చేశాను. అదేవిధంగా ‘కృష్ణార్జున యుద్ధం’, హలో గురు ప్రేమ కోసమే, రాజా ది గ్రేట్ లాంటి చిత్రాలకు పనిచేశాను. ప్రస్తుతం మజిలీ, వెంకీ మామ, జెర్సీ లాంటి చిత్రాలకు ఆయన పని చేస్తున్నాను.

ఒక ఫైట్ మాస్టర్ గా మిమ్మల్ని ఎవ్వరు ఎక్కువుగా ప్రోత్సహించారు ?

నానిగారు అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీగారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు, నానిగారు న్యూ టాలెంట్ ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. అలాగే బన్నీ సర్ కూడా.

ఫైట్స్ చేస్తోన్న క్రమంలో మీకు ఎప్పుడైనా గాయాలు తగిలాయా ?

చాలా సార్లు అండి. కాలుకు తగిలిన గాయం కారణంగా దాదాపు సంవత్సరం పాటు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక ఫైటర్ గా చాలా కష్టం ఉంటుంది. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎలాగైనా ఫైట్ మాస్టర్ అవ్వాలని.

సంవత్సరం పాటు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. పెద్ద గాయమే అయ్యి ఉంటుంది. మరి ఆ సమయంలో అసలు ఈ ప్రొఫెషన్ కి ఎందుకొచ్చామని బాధ పడలేదా ?

ఫైటర్స్ లైఫ్ అంటేనే.. చాలా రిస్క్ తో కూడుకొని ఉంటుంది. సెట్స్ లో ఎవరికైనా గాయాలు అయినప్పుడు చాలా బాధగా ఉంటుంది. కానీ ఏం చెయ్యలేం. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకుండా పని చెయ్యటానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను.

మీ నుండి దర్శకులు గాని, హీరోలు గాని కొత్తగా ఏమి ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు ?

కొత్తగా అంటే.. అది హీరోలను బట్టే ఉంటుంది అండి. ఎన్టీఆర్ గారికి ఒకలా కంపోజ్ చెయ్యాలి, బన్నీగారికి మరోలా కంపోజ్ చెయ్యాలి. అయితే నా వరకూ నేను కంపోజ్ చేసే ఫైట్స్ లో నా శైలి చాలా స్పష్టంగా కనిపించేలా చూసుకుంటాను.

స్టార్ హీరోల్లో మీరు ఏ స్టార్ హీరోతో పని చెయ్యడానికి ఎక్కువుగా ఇష్టపడతారు ?

వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అంటే, నాకు బాగా ఇష్టం. ఇక సినిమాల పరంగా, అల్లు అర్జున్ గారి సినిమాలకి పని చెయ్యడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తాను. ఎందుకంటే.. ఆయన ఏదైనా చేయగలుగుతారు. షాట్ బాగుంది అనుకుంటే.. ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. ఆయన దగ్గర పని చేస్తే.. మన సృజనకు లిమిట్స్ ఉండవు.

చివరగా మీ గురించి ఏమి చెబుతారు ?

ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదండి. ఒక ఫైట్ మాస్టర్ గా నాకంటూ తెలుగు సినీపరిశ్రమలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. అలాగే అందరీ హీరోలతో పని చెయ్యాలి. అంతే.. !

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :