కోరుకున్న దర్శకుడితోనే సినిమా చేస్తున్న రామ్ !


యంగ్ హీరో రామ్ నటించిన చివరి చిత్రం ‘హైపర్’ బాక్సాఫీస్ ముందు పెద్దగా హవా చూపించలేకపోయింది. దాంతో రామ్ ఈసారి భిన్నమైన కాన్సెప్ట్ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి చెప్పిన స్క్రిప్ట్ ను ఓకే చేసి సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. కానీ కారణాలు తేలీదు కానీ అది కాస్త రద్దయింది. ఇప్పుడు అదే స్టోరీని రవి తేజ ‘ రాజా ది గ్రేట్’ పేరుతో చేస్తున్నాడు. ఆ తర్వాత కిశోర్ తిరుమల, కరుణాకరన్ లతో చర్చలు జరిపిన రామ్ కిశోర్ తిరుమల కథ పట్ల ఇంప్రెస్ అయినా ఏ విషయం తేల్చకపోవడంతో ఆ దర్శకుడు కాలయాపన చేయడం ఇష్టం లేక వెంకటేష్ తో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమాకు సిద్దమయ్యాడు.

అలా మౌనం కారణంగా తనకు ‘నేను శైలజ’ వంటి హిట్టిచ్చిన దర్శకుడితో మరో సినిమా చేసే అవకాశాన్ని వదులుకున్న రామ్ కు వెంకీ – కిశోర్ తిరుమల ప్రాజెక్ట్ అనుకోని విధంగా క్యాన్సిలవడంతో మరో గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టైంది. ఈసారి కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనుకున్న రామ్ వెంటనే కిశోర్ తిరుమల ప్రాజెక్టును ఓకే చేసి ఎట్టకేలకు మొదట తను కోరుకున్న దర్శకుడితోనే సినిమాకు సిద్దమయ్యాడు. ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిశోర్ నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎవరనే వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.