ఎట్టకేలకు శంకర్ నెక్స్ట్ మూవీ కదులుతోంది.. కానీ కండీషన్స్ అప్లై..!

ఎట్టకేలకు శంకర్ నెక్స్ట్ మూవీ కదులుతోంది.. కానీ కండీషన్స్ అప్లై..!

Published on Jan 29, 2026 12:00 AM IST

shankar

ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఆయన పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్ పారి’ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం ‘ఇండియన్ 3’ షూటింగ్ పెండింగ్‌లో ఉండగా, దానికి అదనపు బడ్జెట్ కేటాయించడానికి లైకా ప్రొడక్షన్స్ ఆసక్తి చూపడం లేదు. దీంతో శంకర్ తన దృష్టిని ‘వేల్ పారి’ ప్రాజెక్టుపైకి మళ్లించారు. తాజాగా ఈ భారీ పీరియడ్ డ్రామాను నిర్మించడానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘పెన్ స్టూడియోస్’ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రణవీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ కోసం వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాని స్థానంలో ఇప్పుడు ‘వేల్ పారి’ని పట్టాలెక్కించడానికి పెన్ స్టూడియోస్ సిద్ధమైంది.

అయితే, శంకర్ గత చిత్రాల ఫలితాలు దృష్టిలో ఉంచుకుని పెన్ స్టూడియోస్ ఆయనకు కొన్ని కండిషన్లు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ పరిమితి దాటకూడదని, షూటింగ్ షెడ్యూల్ విషయంలో ఖచ్చితంగా ఉండాలని వారు కోరినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు