’గ్యాంగ్ లీడర్’… సినిమా ఓ సంచలనం. ’సుప్రీమ్’ హీరో చిరంజీవిని మెగాస్టార్ గా మార్చిన సినిమా. ’గ్యాంగ్ లీడర్’ 1991 మే 9 న విడుదలైంది. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ చిత్రం చాలా దోహదం చేసింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి నటించింది. విజయశాంతి నటనతో పాటు గ్లామర్ ఈ సినిమాకు ఓ ప్లస్ పాయింట్. అంతవరకూ కుటుంబకథాచిత్రాలు చేస్తున్న విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అటు కుటుంబఅనుబంధాలు చూపుతూనే చక్కటి కమర్షియల్ సినిమాకు నిర్వచనంలా ఈ చిత్రం నిలిచింది. రావుగోపాల రావు విలనిజం, అల్లు రామలింగయ్య హాస్యం గుర్తుండిపోతాయి.
బప్పిలహరి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. జి ఏ యన్ జి గ్యాంగ్ అనే పాటకానీ, భద్రాచలం కొండ, వానా వానా వెల్లువాయే పాట కానీ, సండే అననురా మండే అననురా అనేపాట కానీ ఏ పాటకాపాట ప్రత్యేకం. ప్రభుదేవా సమకూర్చిన డ్యాన్సులు ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఈ సినిమాలో చిరంజీవితో పాటు పోటీపడి విజయశాంతి డ్యాన్స్ చేసింది. ఈ సినిమా 100 రోజుల పండుగను (శతదినోత్సవం) తిరుపతి, హైదరాబాదు, ఏలూరు, విజయవాడలలో ఒకేరోజు జరుపుకుని సంచలనం సృష్టించింది. ఇందుకోసం అప్పట్లో ప్రత్యేక విమానాన్ని వాడారు. అలాగే పరుచూరి బ్రదర్స్ రాసిన మాటలు కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. ’చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను’ అన్న చిరంజీవి డైలాగు ఈ చిత్రంలోనిదే. ఈ సినిమాలో లోక్ సింగ్ ఫోటోగ్రఫీ కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.


