సమీక్ష : ‘గీతా.. ఛలో’ – స్లోగా సాగే రొమాంటిక్ కామెడీ !

Published on May 4, 2019 4:00 am IST

విడుదల తేదీ : మే 03, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : గోల్డెన్‌స్టార్ గణేశ్, రష్మికా మండన్న, అక్షయ్ నాయక్ త‌దిత‌రులు.

దర్శకత్వం : సుని

నిర్మాత : మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్

సంగీతం : జూదా సంధ్య

సినిమాటోగ్రఫర్ : సంతోష్ రాజ్

స్క్రీన్ ప్లే : సుని

కన్నడ స్టార్ గణేశ్, రష్మికా మండన్న జంటగా నటించిన కన్నడ చిత్రం ‘చమక్’. కాగా ఈ చిత్రాన్ని ‘గీతా.. ఛలో’ పేరుతో నిర్మాతలు మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా తెలుగులోకి విడుదల చేశారు. మరి ఈ డబ్బింగ్ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
 

కథ :

కృష్ణ (గోల్డెన్‌ స్టార్ గణేశ్) వీకెండ్‌ పార్టీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కారణంగా ఒక అమాయకమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన ఎంజాయ్ కి ఎలాంటి అడ్డురాదని.. ప్లాన్ చేసి అమాయికురాలైన ఖుషి (రష్మికా మండన్న)ని తనకు ఏ అలవాట్లు లేవని మాయ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత జరిగే కొని నాటకీయ పరిణామాల అనంతరం ఖుషి కూడా తన లాంటిదే అని.. ఆమె అమాయికురాలు కాదని కృష్ణకు తెలుస్తోంది. అలాగే కృష్ణ గురించి కూడా ఖుషికి నిజం తెలుస్తోంది. ఆ తరువాత వారి జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? చివరికి ఇద్దరూ అన్ని అభిప్రాయభేదాలను మర్చిపోయి ఒకటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

‘ఛ‌లో, గీత గోవిందం’ చిత్రాల విజ‌యాలతో టాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది రష్మికా మండన్న . మరి రష్మిక క్రేజ్ ను బేస్ చేసుకుని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ డబ్బింగ్ చిత్రం ఎలా ఉన్నప్పటికీ రష్మికా మండన్న మాత్రం ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఖుషి అనే రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన రష్మికా మండన్న చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా మొదట్లో హీరోతో సాగే ప్రేమ సన్నివేశాల్లో.. అలాగే ఆ తరువాత హీరో మీద కోపం చూపించే సందర్భాల్లో రష్మిక పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన గోల్డెన్‌ స్టార్ గణేశ్ చక్కని నటనను కనబరిచాడు. తాను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ.. తన నటనతో అక్కడక్కడా నవ్విస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

మెయిన్ గా తన చేతిలో బిడ్డ చనిపోయే లాంటి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో గణేష్ నటన చాలా బాగుంది. అలాగే హీరోయిన్ తో సాగే ప్రేమ అండ్ ఫ్యామిలీ సన్నివేశాల్లో వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

సినిమాలో అక్కడక్కడా ఎంటర్ టైన్ గా ఉన్నా.. కథ సింపుల్ గా ఉండటం, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ రెగ్యూలర్ గా ఉండటం, ఒక్క హీరోయిన్ మినహా.. మిగిలిన నటీనటులు మొత్తం తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్త కావడం, సినిమాలో బలమైన సంఘర్షణ లేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి.

మొదటి భాగం సరదాగా సాగుతూ పర్వాలేదనిపించినప్పటికీ, రెండువ భాగం మాత్రం నెమ్మదిగా సాగుతుంది. దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సాగే కీలక సన్నివేశాలకు లాజిక్ ఉండదు. ఇద్దరూ తమ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని పెళ్లి చేసుకోవడం అసలు బాగాలేదు.

ప్రధానంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు కూడా, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవు. వీటికి తోడు హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా అనవసరమైన ఎమోషన్ కి లోబడి.. మరి నాటకీయకంగా సాగుతాయి. ఇద్దరూ ప్రేమ కోసం తమ పట్టుదలలను పక్కన పెట్టి.. తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఇద్దరూ ఒకరి కోసం ఒకరు తగ్గారు అని చూపెట్టి ఉంటే.. వారి ఎమోషన్ అండ్ పెయిన్ ఇంకా బలంగా ఎలివేట్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు సుని వీకెండ్ పార్టీస్ సంబంధించి మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నారు. అయితే ఆ కాన్సెప్ట్ ని తెర మీద చూపెట్టడంలో కొంత తడబాటు పడ్డాడు. సంతోష్ రాజ్ కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి.

ఇక సంగీత దర్శకుడు సంధ్యా అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బాగుంది. ఎడిటర్ పనితనం కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చెయ్యడానికి నిర్మాతలు మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి.

 

తీర్పు :

రష్మికా మండన్న క్రేజ్ ను బేస్ చేసుకుని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ డబ్బింగ్ చిత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగలేదు. అయితే రష్మికా మండన్న మాత్రం ఆకట్టుకుంది. సినిమా అక్కడక్కడా ఎంటర్ టైన్ గా నడిచినప్పటికీ.. కథ సింపుల్ గా ఉండటం, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కీలకమైన సీన్స్ కు లాజిక్స్ లేకపోవడం, ఒక్క హీరోయిన్ మినహా.. మిగిలిన నటీనటులు మొత్తం తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్త కావడం, సినిమాలో బలమైన సంఘర్షణ లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ జోనర్ మూవీస్ ను ఇష్టపడేవారికి, అలాగే రష్మికా మండన్న అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

More