ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు హరీష్ శంకర్. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ పెద్ద సక్సెస్ అందుకోవడంతో దీని పై అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా శ్రీలీల నటిస్తోంది. అయితే విషయం ఏమిటంటే, తాజాగా మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన 2018 మూవీ తెలుగు వెర్షన్ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని బన్నీ వాస్ విడుదల చేస్తున్నారు.
ఇక ఈరోజు ఈ సినిమాని తెలుగు మీడియాకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం అనంతరం హరీష్ శంకర్, బన్నీ వాస్, మూవీ డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ తదితరులు మీడియా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో గీతా ఆర్ట్స్ ఎక్కువ డబ్బింగ్ సినిమాలను ఎందుకు విడుదల చేస్తుందని, అలాగే 2018 లాంటి కాన్సెప్ట్ తో సినిమా తీసే సత్తా తెలుగు దర్శకనిర్మాతలకు ఉందా అని బన్నీ వాస్‌ని ఓ విలేఖరి ప్రశ్నించారు.
ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్న తరుణంలో ఇది సరైన ప్రశ్న కాదంటూ హరీష్ శంకర్ దానికి సమాధానం ఇచ్చారు. మన సినిమాలు ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతున్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలని అన్నారు హరీష్. హిందీ ప్రేక్షకులు RRR, KGF మరియు బాహుబలిని డబ్బింగ్ సినిమాలుగా చూడలేదని హరీష్ వ్యాఖ్యానించారు. అది డబ్బింగ్ సినిమా అయినా, రీమేక్ సినిమా అయినా పర్వాలేదని భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌ని ప్రేక్షకులు చూస్తున్నారని హరీష్ అన్నారు.
