బహుముఖ ప్రతిభావంతురాలు, అంతర్జాతీయ టైటిల్ విజేత అయిన హేమలత రెడ్డి ప్రతిష్ఠాత్మక ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025’ కిరీటాన్ని గెలుచుకున్నారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో డిసెంబర్ 12, 2025న ఘనంగా నిర్వహించిన మిస్ & మిసెస్ ఆంధ్రప్రదేశ్ – విజయవాడ 2025 పేజెంట్‌లో ఆమె ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
విశాఖపట్నంలో జన్మించిన హేమలత రెడ్డి, ఇప్పటికే ‘మిస్సెస్ ఇండియా 2024’ మరియు ‘మిసెస్ యూనివర్స్ – ఇంటర్నేషనల్ గ్లోబల్ క్వీన్ 2025’ వంటి అంతర్జాతీయ టైటిల్స్ సాధించారు. ఇన్ని విజయాలు ఉన్నప్పటికీ, తన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందడం భావోద్వేగంగా ఉందని ఆమె తెలిపారు.
ఈ పోటీలో హేమలత రెడ్డి తన అద్భుతమైన ప్రదర్శనతో ‘బెస్ట్ టాలెంట్ రౌండ్ విజేత’ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధ ఫ్యాషన్ ఐకాన్, పేజెంట్ మెంటార్ శ్రీ సతీష్ అడ్డాల (ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సోదరుడు) అద్భుతంగా నిర్వహించారు. ఇది ఆయన నిర్వహించిన 43వ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ కావడం విశేషం.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు సముద్రరావు, వి.వి. గోపాలకృష్ణ, రాజ్ కుమార్ సహా ప్రముఖులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. ఈ కిరీటం హేమలత రెడ్డి నిరంతర కృషికి, ఆత్మవిశ్వాసానికి, అలాగే తన మూలాలపై ఉన్న గౌరవానికి నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు.


