అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. ధనరాజ్ లెక్కల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్ విడుదల, ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, అలీ, వీఎన్ ఆదిత్య, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రసన్న కుమార్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
రైతు, యువత నేపథ్యంలో నడిచే ఒక ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది. సినిమాలో అంజి కెమెరా వర్క్, చరణ్ అర్జున్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి సగం వినోదాత్మకంగా, రెండో సగం భావోద్వేగాలతో సాగుతుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రమోషన్ పనులను ముగించుకుని, ఈ నెల 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.


