
ఇండియన్ సినిమా అంటే ఒక్క హిందీ సినిమా మాత్రమే అన్న అభిప్రాయాలున్న నేపథ్యంలో ఒక ప్రాంతీయ సినిమా దేశవ్యాప్తంగా ఓ ప్రభంజనం సృష్టించి చరిత్రకెక్కింది. ఆ సినిమాయే దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి’. ప్రపంచవ్యాప్తంగా జూలై 10న విడుదలైన ఈ సినిమా ట్రేడ్ పండితుల ఊహకు కూడా అందని రీతిలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాక తమిళం, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్నిచోట్లా ఈ సినిమా రికార్డుల మోత మోగించింది.
ఇండియన్ మార్కెట్లో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్స్ సినిమాలను సైతం పక్కనపెట్టేసి ‘బాహుబలి’ సినిమా బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ స్థానంలో నిలబడడం ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనే అభిప్రాయాన్ని తుడిచేసింది. రాజమౌళి విజన్, ప్రభాస్, రానాల యాక్టింగ్, ఇలాంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించే సాహసం చేసిన ఆర్కా మీడియా వర్క్స్ డెడికేషన్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్.. అన్నీ కలిసి ‘బాహుబలి’ని అంతర్జాతీయ సినిమాగా నిలబెట్టాయ్.
పలు అంతర్జాతీయ పత్రికలను సైతం ఆశ్చర్యపరచిన ‘బాహుబలి’, ఈమధ్యే ఓ ఇంటర్నేషనల్ వర్షన్‌తో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమవుతోంది. ఇక ఈ ఫెస్టివల్స్‌లో వచ్చిన క్రేజ్ ద్వారా మరికొన్ని రోజుల్లో చైనా, జపాన్లలో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్ విడుదల కానుంది. ఇక బాహుబలి పార్ట్ 1యే ఈ స్థాయి ప్రభంజనం సృష్టిస్తే వచ్చే ఏడాది రానున్న ‘బాహుబలి’ పార్ట్ 2 ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం. ప్రస్తుతం రాజమౌళి అండ్ టీమ్ రెండో పార్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

