
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. ఎప్పట్నుంచో వివాదాలను ఎదుర్కొంటూ వస్తోన్న ఈ సినిమా చివరకు అన్ని అడ్డంకులను దాటుకొని మరికాసేపట్లో విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా నిన్నే (మే 1న) విడుదల కావాల్సింది. చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా నిన్న విడుదలకు నోచుకోలేదు. నిన్న ఉదయం 6 గంటల నుంచే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకూ కూడా విడుదల విషయమై సరైన స్పష్టత లేకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు.
ఇదిలా ఉంటే ఈరోజు కూడా ఉదయం షోలు క్యాన్సల్ కావడం మరింత ఆందోళనకు గురిచేసింది. ఇక ఎట్టకేలకు చిత్ర నిర్మాతలు ఈ సినిమా విషయంలో వరుస చర్చలు జరిపిన తర్వాత ఓ ప్రెస్‌మీట్ ద్వారా సినిమా విడుదలకు సిద్ధమైందన్న విషయాన్ని తెలియజేశారు. ప్రముఖ తమిళ సినిమా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్, యూవీ ప్రొడక్షన్స్ ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాయి. ఇప్పటికే అన్ని థియేటర్లకు అఫీషియల్ ప్రకటన వెళ్ళిపోయింది. ఇక అన్ని అడ్డంకులను దాటిన ఈ సినిమా మధ్యాహ్నం షో ద్వారా థియేటర్లలో కళకళలాడనుంది. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆండ్రియా, పూజా కుమార్‌లు నటించారు.

