‘రాజు గారి గది 2’ హీరో నేనే : నాగార్జున
Published on Nov 27, 2016 12:13 pm IST

Nagarjuna
అక్కినేని నాగార్జున వరుస హిట్లతో ఈతరం ప్రేక్షకుల్లోనూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంటూ వెళుతున్నారు. ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఆ క్రేజ్‌ను అందుకునేలానే, డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేస్తూ వెళుతోన్న ఆయన, ఇప్పటికే ‘ఓం నమో వెంకటేశాయ’ అనే భక్తిరస చిత్రాన్ని చివరిదశకు తీసుకొచ్చారు. దీంతో పాటు ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది 2’ అన్న సినిమా చేసేందుకు సిద్ధమైపోయారు.

ఓంకార్ దర్శకత్వంలోనే రూపొంది సూపర్ హిట్ కొట్టిన ‘రాజు గరి గది’ సినిమా తరహాలోనే హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రాజు గారి గది 2’ అన్న టైటిల్ బాగుంటుందని ఆ టైటిల్ పెట్టారట. ఇక ఈ ఉదయం హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. నాగార్జున, ఓంకార్, నిర్మాత పీవీపీ, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తదితరులు సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ ‘రాజు గరి గది 2’లో తనది గెస్ట్ రోల్ కాదని అన్నారు.

“రాజు గారి గది 2కి హీరోని నేనే! మైండ్ గేమ్ ఆడుతూ ఉండే ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించనుండడం చాలా కొత్తగా ఉంది. మరో మూడు, నాలుగు వారాల్లో ఈ సినిమాలో నా లుక్ ఎలా ఉండనుందో బయటకు వస్తుంది. ఓంకార్ నా లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. కొత్త కొత్త జానర్స్‌లో సినిమాలు చేయడం బాగుంటుంది.” అని నాగార్జున తెలిపారు. ఓంకార్ మాట్లాడుతూ.. “రాజు గారి గది 2 అన్న టైటిల్ పెట్టామే కానీ, ఇదొక కొత్త స్టోరీ. నాగార్జున గారు ఫుల్ లెంగ్త్ హీరోగా కనిపించనున్నారు.” అని అన్నారు. తమ సంస్థ గత చిత్రాల్లానే భారీ బడ్జెట్‌తో, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో సినిమా తెరకెక్కనుందని పీవీపీ స్పష్టం చేశారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook