ఇంటర్వ్యూ : సోను సూద్ – నాకు ఇంత స్టేటస్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీనే !
Published on Jan 27, 2017 2:22 pm IST


ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్, భారతీయ నటీనటులు సోను సూద్, దిశా పఠాని, అమైరా దస్తూర్ లు కలిసి నటించిన యాక్షన్ కామెడీ అడ్వెంచరస్ చిత్రం ‘కుంగ్ ఫు యోగా’ ఇంగ్లీష్, హిందీలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సైతం విడుదల కానుంది. ఈ సందర్బంగా నటుడు సోను సూద్, నటి అమైరా దస్తూర్ లు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) సోను సూద్ గారు ఈ సినిమా తెలుగులో సైతం విడుదలకావడం ఎలా ఉంది ?
జ) ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మొదటి ఇంజనీర్ అయినా నేను తరివాత సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమలే నాకు మంచి ఫ్లాట్ ఫార్మ్ ఇచ్చాయి. మీ వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నాకు ఇంత స్టేటస్ ఇచ్చింది ఈ పరిశ్రమే. ముఖ్యంగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న కల్పన గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను.

ప్ర) జాకీచాన్ లాంటి ప్రపంచస్థాయి హీరోతో నటించడం ఎలా ఉంది ?
జ) ఆయనతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. పని పట్ల ఆయన నిబద్దత, డెడికేషన్, ప్యాషన్ చాలా గొప్పవి.

ప్ర) సెట్లో జాకీచాన్ ఎలా ఉండేవారు ?
జ) ఆయన అందరితో కలిసి మెలసి ఉండేవారు. లైట్ బాయ్ దగ్గర్నుంచి అందరినీ సమానంగా చూసేవారు. ప్రతి ఒక్కరికీ ఏం కావాలో అడిగి మరీ ఏర్పాటు చేసేవారు. ఒక్కోసారి అందరికీ ఆయనే ఫ్రూట్స్ సర్వ్ చేసేవారు.

ప్ర) జాకీచాన్ గారి దగ్గర్నుంచి ఏం నేర్చుకున్నారు ?
జ) ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో నేర్చుకున్నాను. అయన నటన, యాక్షన్ స్టంట్స్ చాలా గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా ఆయన క్రమశిక్షణ నాకు బాగా నచ్చింది.

ప్ర) ఆయనతో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికి ట్రైనింగ్ తీసుకున్నారా ?
జ) అవును. సినిమాకి ముందే కుంగ్ ఫులో శిక్షణ తీసుకున్నాను. మనం ఒక పంచ్ కొట్టేలోపే ఆయన మూడు పంచెస్ కొడతారు. ఆయన రిథమ్ కి తగ్గట్టు ఉండేలా చూసుకున్నాను.

ప్ర) తెలుగులో సినిమా చేసి చాలా రోజులైనట్టుంది ?
జ) అవును చాలా కాలమైంది. తెలుగు పరిశ్రమ నన్ను మిస్వట్లేదు. నేనే ఈ పరిశ్రమను మిస్సవుతున్నాను. ఏదైనా పని మీద హైదరాబాద్ లో అడుగుపెడితే నా మథర్ సాయిల్ మీదకి వచ్చినట్టే ఉంటుంది.

ప్ర) జాకీచాన్ తో కలిసి డ్యాన్సులు చేయడం ఎలా ఉంది ?
జ) ఆయనతో కలిసి డ్యాన్సులు చేయడం ఒక మంచి అనుభవం. ఆయన యాక్షన్ సన్నివేశాలు చేయడం కన్నా డ్యాన్సులు చేయడంలోనే ఎక్కువ ఎంజాయ్ చేసేవారు.

ప్ర) జాకిచాన్ తో సినిమా అనగానే మీ తెలుగు సినిమా ఫ్రెండ్స్ ఎలా ఫీలయ్యారు ?
జ) ముఖ్యంగా పూరి జగన్నాథ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. నన్ను విష్ చేసి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు.

ప్ర) గతంలో కూడా ఒక చైనీస్ సినిమాలో నటించారు. దాని విశేషాలు చెప్పండి
జ) ఇంతకు ముందు ‘క్సుయాన్ జాన్గ్’ అనే చైనీస్ – ఇండియన్ హిస్టారికల్ సినిమాలో నటించాను. అది బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్ కూడా నామినేట్ అయింది.

 
Like us on Facebook