ఇంటర్వ్యూ : బన్నీ వాస్ – క్రియేటివ్ సినిమాల నిర్మాణమే ‘గీతా ఆర్ట్స్ 2’ టార్గెట్!

banni-vasu
‘భలే భలే మగాడివోయ్’.. హీరో నాని, దర్శకుడు మారుతిల కాంబినేషన్‌లో రూపొందిన క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్. ఆడియో, ట్రైలర్స్ ద్వారానే అంతటా అంచనాలను పెంచేసిన ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నుండి కొత్తగా లాంచ్ అయిన గీతా ఆర్ట్స్ 2పై ఈ సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను కో ప్రొడ్యూస్ చేసింది. ఇక అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘గీతా ఆర్ట్స్’ ఉండగా, ‘గీతా ఆర్ట్స్ 2’ అని కొత్త ప్రొడక్షన్ హౌస్ ఎందుకు లాంచ్ చేశారు?

స) గీతా ఆర్ట్స్ సంస్థది ఎన్నో ఏళ్ళ ప్రయాణం. అల్లు అరవింద్ గారు ఎంతో కష్టపడి గీతా ఆర్ట్స్‌కి ఒక బ్రాండ్ తెచ్చారు. ఆ బ్యానర్‌పై నా పేరుతో ‘100% లవ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘కొత్తజంట’ లాంటి సినిమాలను రూపొందాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ అని చెప్పి మా పేరును నిర్మాతగా చూడడం ఎందుకో నచ్చలేదు. అందుకే కొత్తగా ఈ ‘గీతా ఆర్ట్స్ 2’ అన్న బ్యానర్ నెలకొల్పాం. నేను, అల్లు శిరీష్ ఈ బ్యానర్‌పై కొత్త దనమున్న క్రియేటివ్ సినిమాలను మిడిల్ లెవెల్ బడ్జెట్‌లో తీయాలని డిసైడ్ అయ్యాం.

ప్రశ్న) ఈ బ్యానర్‌లో ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు?

స) గీతా ఆర్ట్స్ బ్యానర్ అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్ గారు భారీ బడ్జెట్ సినిమాలను తీస్తుంటారు. ఇక ఈ కొత్త బ్యానర్‌లో అన్నీ కొత్తదనమున్న, క్రియేటివ్ సినిమాలనే చేయాలనుకుంటున్నాం. అప్పుడే ఈ బ్యానర్‌కి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా రెడీ అయిపోయాయ్! కొత్తవాళ్ళను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలన్న ఆలోచన కూడా ఉంది.

ప్రశ్న) ఈ బ్యానర్‌లో మొదటి ప్రయత్నం ‘భలే భలే మగాడివోయ్’ గురించి చెప్పండి?

స) ‘భలే భలే మగాడివోయ్’ ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకూ ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఉదయమే ఫైనల్ కాపీ చూశా. దర్శకుడు మారుతి చెప్పిన దానికంటే చాలా బాగా తీశాడు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) మారుతి సినిమాకు ఒక బ్రాండ్ ఉంటుంది. ఈ సినిమా కూడా అదే పంథాలో ఉంటుందా?

స) మారుతి, ముందే ఈ సినిమాను ఒక క్లీన్ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్నాం అని చెప్పారు. చెప్పినట్లుగానే, అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా తీశారు. ఎక్కడా ఈ సినిమాలో ఒక్క చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ లాంటిది ఉండదు. ప్యూర్ మారుతి సినిమా తీస్తే అది ‘భలే భలే మగాడివోయ్’.

ప్రశ్న) హీరో నాని గురించి చెప్పండి?

స) మారుతి నాకు ఈ కథ చెప్పినప్పుడే సినిమాలో ఫన్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమైపోయింది. ఇక నాని ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత దాని రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ జనరేషన్ హీరోల్లో అల్టిమేట్ టైమింగ్ ఉన్న నటుల్లో నాని ఒకరు. నాని టైమింగ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని చెప్పగలను.

ప్రశ్న) ఆడియో, ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉంది?

స) చాలా బాగుంది. గోపీ సుందర్ మన తెలుగు సినిమా స్టైల్లో మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే అన్నిచోట్లా ఈ సినిమా పాటలు పాపులర్ అయ్యాయి. సినిమా విడుదలయ్యాక ఈ సినిమా పాటలు మరింత పాపులర్ అవుతాయి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మేము చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ను ట్రైలర్ ద్వారానే రివీల్ చేశాం. ఆ కాన్సెప్ట్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌, ఆడియోకు ఏమాత్రం తగ్గని రేంజ్‌లో సినిమా ఉంటుంది.

ప్రశ్న) అల్లు అర్జున్, ప్రభాస్ సినిమా చూశారట. సినిమాపై వాళ్ళ కామెంట్స్ ఏంటి?

స) అల్లు అర్జున్ ఎడిటింగ్ అప్పుడే కొంత చూశాడు. ఫైనల్ కాపీ ఇంకా చూడలేదు. ఎడిట్ కాపీ ఆయనకు విపరీతంగా నచ్చింది. ఇక ప్రభాస్, యూవీ క్రియేషన్స్ ఆఫీస్‌లో ఈ సినిమా చూశారు. ప్రభాస్ గారికి సినిమా చాలా నచ్చింది. ఆయన ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేశారు.

ప్రశ్న) ఈ సినిమా తర్వాత ‘గీతా ఆర్ట్స్ 2’ ప్లాన్స్ ఏంటి?

స) రాజ్ తరుణ్ హీరోగా మున్నా అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాం. టీవీ ప్రముఖులు ప్రభాకర్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశాం. ప్రతీ ఏడాదికి ఈ బ్యానర్‌లో మూడు సినిమాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.

Exit mobile version