మన దగ్గర కత్తి పట్టుకోవడానికి చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు. ప్రేమకథలు చేసే హీరోలు తక్కువ ఉన్నారని నా అభిప్రాయం. ఫ్యామిలీ అందరూ కలసి చూసే సినిమాలలో నటించాలని నా కోరిక. అంటున్నాడు యువ హీరో నాగ శౌర్య. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో మంచి విజయం అందుకున్న శౌర్య.. వెంటనే, ‘దిక్కులు చూడకు రామయ్య’ అంటూ ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యాడు. త్రికోటి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 10న విడుదలవుతుంది. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి నిర్మించారు. అజయ్, ఇంద్రజ నాగ శౌర్య తల్లిదండ్రులుగా నటించారు. సన హీరోయిన్. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియాతో సమావేశం అయ్యారు హీరో నాగ సౌర్య. ఆ విశేషాలు మీకోసం..
ప్రశ్న) ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా ఎలా ఉండబోతుంది..?
స) కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. తండ్రి కొడుకులు ఒకే అమ్మాయి వెంట పడినా, ప్రేమించినా సినిమాలో ఎక్కడా… కొంచం కూడా వల్గారిటీ ఉండదు. ఒక విషయాన్ని పాజిటివ్ గా చెప్పొచ్చు. నెగిటివ్ గా కూడా చెప్పొచ్చు. మా సినిమా పాజిటివ్ గా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది.
ప్రశ్న) ఈ కథ విన్నప్పుడు, ఇటువంటి సినిమాలో నటించడం రిస్క్ అనిపించలేదా..?
స) లేదండి. నాకంటే ముందు నిర్మాత సాయి కొర్రపాటి గారు ఈ స్క్రిప్ట్ విని ఓకే చేశారు. ఆయన స్క్రిప్ట్ ను నమ్మారు. నేను ఆయనను నమ్మాను. నా మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’కు ఆయనే నిర్మాత. ఒక సంవత్సర కాలం నుండి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. సాయి గారి టేస్ట్ తెలుసు. ఫ్యామిలీ అందరూ కలసి చూసే సినిమాలను మాత్రమే నిర్మిస్తారు. ఉదాహరణకు ‘అందాల రాక్షసి’, ‘ఈగ’, ‘ఊహలు గుసగుసలాడే’.
ప్రశ్న) సినిమాలో హైలైట్స్ ఏంటి..?
స) కీరవాణి గారి సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పాలి. సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఆల్రెడీ, పాటలు సూపర్ హిట్ అయ్యాయి. వాటిని అంతే అందంగా చిత్రీకరించాం. తర్వాత అజయ్, ఇంద్రజ, నా క్యారేక్టరైజేషన్ లు మెయిన్ హైలైట్స్ అవుతాయి.
ప్రశ్న) ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు..?
స) నిర్మాత సాయి గారు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. శౌర్య.. సినిమా చూసిన తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి తల్లి నీలాంటి కొడుకు ఉండాలని కోరుకుంటుంది. నీ క్యారెక్టర్ అద్భుతంగా వచ్చింది. బాగా నటించావు అని సాయి గారు చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ప్రశ్న) ఒక హీరోగా మీరు ఎలాంటి ఇమేజ్ కోరుకుంటున్నారు..? మీకు ఏ తరహా పాత్రలంటే ఇష్టం..?
స) హిందీలో అమీర్ ఖాన్ తరహా ఇమేజ్ కోరుకుంటున్నాను. కొత్త కథలు, డిఫరెంట్ జోనర్ సినిమాలకు నా ఓటు. ఫ్యామిలీ అందరూ కలసి చూసే సినిమాలలో నటించాలని నా కోరిక. లవర్ బాయ్, పక్కింటి కుర్రాడు తరహా పాత్రలు ఎక్కువగా చేస్తాను. బూతు సినిమాలకు నేను దూరంగా ఉంటాను. వారాహి చలన చిత్రం బ్యానర్ ద్వారా నేను హీరోగా పరిచయం అయ్యాను. ఆ బ్యానర్ వేల్యూ నిలబెట్టే విధంగా నడుచుకుంటాను.
ప్రశ్న) యువ హీరోలందరూ యాక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపితే మీరు ఫ్యామిలీ సినిమాలు అంటున్నారు..?
స) మన దగ్గర కత్తి పట్టుకోవడానికి చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు. ప్రేమకథలు చేసే హీరోలు తక్కువ ఉన్నారని నా అభిప్రాయం. కెరీర్ ప్రారంభంలో మాస్ సినిమాలు చేస్తే తొందరగా ఇండస్ట్రీ నుండి బయటకు వెళ్ళిపోతాను. యాక్షన్ సినిమాలు చేయడానికి ఒక ఇమేజ్ అవసరం. దానికి కొంత సమయం పడుతుంది. బహుశా, కొన్ని సినిమాలు చేసిన తర్వాత భవిష్యత్ లో నేను యాక్షన్, మాస్ సినిమాలు చేస్తానేమో. ప్రస్తుతానికి అమ్మాయిల వెంట పడుతూ కాలేజీకి వెళ్ళే కుర్రాడి పాత్రలు చేస్తాను.
ప్రశ్న) మీ ఫేవరెట్ హీరో ఎవరు..?
స) నాగార్జున & జూనియర్ ఎన్టీఆర్. ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా చూసిన తర్వాత నాగార్జున గారి అభిమాని అయిపోయా. ఆయన నటన అంటే చాలా ఇష్టం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఒక కసి ఉంటుంది. చాలా కష్టపడి పైకొచ్చారు. నేను కూడా అలా కసిగా వర్క్ చేస్తాను.
ప్రశ్న) మీ తదుపరి సినిమా గురించి చెప్పండి..?
స) ‘దిక్కులు చూడకు రామయ్య’ తర్వాత ‘లక్ష్మి మా ఇంటికి రావే’ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాకపోతే, డిఫరెంట్ స్టొరీ. ఈ సినిమాలో నాకు జోడిగా అవికా గొర్ నటిస్తుంది.
ప్రశ్న) మీ సినిమాలకు అచ్చ తెలుగు టైటిల్స్ పెట్టడానికి కారణం..?
స) కథ ప్రకారం ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ & ‘లక్ష్మి మా ఇంటికి రావే’ టైటిల్స్ ను దర్శకనిర్మాతలు ఎంపిక చేశారు. నా ప్రమేయం ఏమి లేదు. ఆయా సినిమాలను కూడా నేను సెలెక్ట్ చేసుకోలేదు. నన్ను హీరోగా దర్శకనిర్మాతలే సెలెక్ట్ చేసుకున్నారు. ఇకపై సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తాను. టైటిల్స్ విషయంలో కూడా తెలుగుదనం ఉండేలా చూసుకుంటాను.
అంటూ ఇంటర్వ్యూను ముగించారు.


