ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – నా పాత్ర చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది !

Published on May 26, 2019 6:37 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేస్తోన్న ‘ఎన్.జి.కె’ సినిమా మే 31వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

అసలు, ముందుగా ‘ఎన్.జి.కె’ అంటే ఏమిటో చెప్పండి ?

‘ఎన్.జి.కె’ అంటే నందగోపాల్ కృష్ణ. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్. నందగోపాల్ కృష్ణ అనే సామాన్య వ్యక్తి రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు ? రావడానికి గల కారణాలు ఏమిటి ? తీరా రాజకీయాల్లోకి వచ్చాక అతను ఏమి చేసాడు ? అనే అంశాలు చుట్టూ ఈ సినిమా ఉంటుంది. క్లుప్తంగా చెప్పుకుంటే నందగోపాల్ కృష్ణ రాజకీయ ప్రయాణం.

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?

ఈ సినిమాలో నా పాత్ర పేరు వనిత. సినిమాలో బలమైన మరియు ప్రతిష్టాత్మకమైన మహిళగా కనిపిస్తాను. నేను ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను. ఖచ్చితంగా మీరు నా పాత్ర కొత్తగా ఉందని ఫీల్ అవుతారు. నా కెరీర్ లో ఇలాంటి వైవిధ్యమైన పాత్రను ఇంతవరకూ చెయ్యలేదు. ఈ పాత్రలో నేను లీనం అవ్వడానికి చాలా కష్టపడ్డాను.

ఈ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్ గురించి చెప్పండి ?

సెల్వరాఘవన్ చాలా తెలివైన దర్శకుడు. అలాగే గొప్ప ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన పని చేయడం వల్ల నేను సినిమాకి సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనకు ప్రతి అంశంపై ఎంతో స్పష్టమైన అవగాహన ఉంటుంది.

హీరో సూర్యతో పని చేయడం ఎలా అనిపించింది ?

సహజంగా చెప్పాలంటే అది ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ఒక చిరస్మరణీయ అనుభవం. ఆయనతో పని చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఆయన తోటి నటీనటులకు ఎంతో సౌకర్యవంతమైన సహ నటుడు. పైగా పెద్ద సూపర్ స్టార్.. అయినా ఆయన అవేవి పట్టించుకోకుండా చాలా సింపుల్ గా ఉంటారు.

ఈ సినిమాలో మీతో పాటు మరో హీరోయిన్ సాయి పల్లవి కూడా నటించింది. ఆమెకు మీకు మధ్య ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ?

ఉన్నాయి. కాకపోతే చాలా తక్కువ సీన్సే. ఆ సీన్స్ షూట్ చేస్తోన్న సమయంలో చాలా ఎంజాయ్ చేశాం.

మీ హిందీ చిత్రం, దే దే ప్యార్ దే గురించి ?

ఆ సినిమాలో నటించడం చాలా అనందంగా ఉంది. నా పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా చేయడానికి కొన్ని తెలుగు తమిళ సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది.

మీ తదుపరి సినిమాలు ఏమిటి ?

‘మన్మథుడు 2’ కాకుండా, హిందీలో మరో సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగు తమిళ సినిమాల్లో కూడా కొన్ని కొత్త చిత్రాలకు సంతకం చేయాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More