ముఖ్య అంశాలు
ఐపీఎల్ 2026 ముగియడంతో ఫ్రాంచైజీల దృష్టి 2027 సీజన్‌పై పడింది. ట్రేడింగ్ విండోలో భాగంగా ఇప్పటికే రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్), కుల్దీప్ యాదవ్ (లక్నో) తమ జట్లను మార్చుకున్నారు.
హార్దిక్ పాండ్యా (ముంబై నుంచి కేకేఆర్), సూర్యకుమార్ యాదవ్ (ముంబై నుంచి రాజస్థాన్) సహా దాదాపు 15 మంది స్టార్ ఆటగాళ్లు కొత్త జట్లలోకి వెళ్లే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్ భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. తిరిగి ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, శివమ్ దూబే లాంటి పాత ప్లేయర్లతో పాటు యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌లను దక్కించుకునేలా యాజమాన్యం పావులు కదుపుతోంది.
ఐపీఎల్ 2026 సందడి ముగియగానే, ఫ్రాంచైజీలన్నీ 2027 సీజన్ కోసం మాస్టర్ ప్లాన్స్ వేయడం మొదలుపెట్టాయి. రాబోయే మెగా వేలానికి ముందే తమ జట్లను బలోపేతం చేసుకునేలా ఆటగాళ్ల ట్రేడింగ్ విండోను వాడుకుంటున్నాయి. ఇప్పటికే రిషబ్ పంత్ తన సొంత గూటికి (ఢిల్లీ క్యాపిటల్స్) చేరుకోగా, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లినట్లు అధికారికంగా ఖరారైంది. అయితే, ఈ రెండు డీల్స్ కేవలం శాంపిల్ మాత్రమే అని, ముందుముందు భారీ మార్పులు ఉండబోతున్నాయని క్రికెట్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
రూమర్స్ రేపుతున్న స్టార్ల లిస్ట్
సుమారు 15 మంది స్టార్ ఆటగాళ్లు తమ జట్లు మారే అవకాశం ఉందన్న వార్తలు అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ తమ స్క్వాడ్‌ను పూర్తిగా మార్చే పనిలో పడింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబైని వీడి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వైపు అడుగులు వేస్తుండగా.. టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు, ముంబై యాజమాన్యం తమ పాత ప్లేయర్లను తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేకేఆర్ నుంచి కామెరాన్ గ్రీన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఇషాన్ కిషన్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నుంచి శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్‌లను ట్రేడింగ్ ద్వారా దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు రాజస్థాన్ నుంచి యశస్వి జైస్వాల్, పంజాబ్ కింగ్స్ నుంచి పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పేర్లు కూడా ముంబై పరిశీలనలో ఉన్నాయి.
ఢిల్లీ, చెన్నై వ్యూహాలు ఎలా ఉన్నాయంటే..
మిగతా జట్ల విషయానికొస్తే ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక ఆటగాళ్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్‌ను వదులుకుని సీఎస్‌కే లేదా లక్నోకు ట్రేడ్ చేసే యోచనలో ఢిల్లీ ఉండగా.. యువ హిట్టర్ అశుతోష్ శర్మ ఢిల్లీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ వైపు వెళ్తున్నట్లు సమాచారం. సీఎస్‌కే నుంచి రాహుల్ చాహర్, గుర్జప్‌నీత్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారే అవకాశాలు బలంగా ఉన్నాయి.
అలాగే, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (కేకేఆర్ నుంచి రాజస్థాన్), ప్రశాంత్ వీర్ (సీఎస్‌కే నుంచి లక్నో), షాబాజ్ అహ్మద్ (లక్నో నుంచి సీఎస్‌కే) కూడా ఈసారి కొత్త జెర్సీల్లో కనిపించే ఛాన్స్ ఉంది. అయితే, పంత్-కుల్దీప్ మినహా ఇవేవీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఫ్రాంచైజీలు తమ తుది నిర్ణయాలను ప్రకటించే వరకు వీటిని ట్రేడ్ రూమర్స్‌గానే చూడాలి. ఏది ఏమైనా రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని సంచలన ప్రకటనలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.


