ప్రభంజనాల ‘బాహుబలి’కి సరిగ్గా ఏడాది..!

baahubali-b
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చనడంలో సందేహం లేదన్న విషయం తెలిసిందే. గతేడాది సరిగ్గా ఇదేరోజున (జూలై 10న) విడుదలై ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా నేటికి ఏడాది పూర్తి చేసుకున్నా, ఆ సినిమా సాధించిన ఘనతలు మాత్రం ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో పలు హాలీవుడ్ పత్రికల మన్ననలు కూడా పొంది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా పలు ఇతర దేశాల్లోనూ సంచలన కలెక్షన్స్ సాధించింది.

ఇక ‘బాహుబలి’కి కొనసాగింపైన ‘బాహుబలి ది కంక్లూజన్‌’ను పూర్తి చేసే పనిలో పడిపోయిన రాజమౌళి టీమ్, గతేడాది ఇదే రోజున విడుదలై తమ సినిమా సాధించిన సంచలనాలను ఒకసారి గుర్తుచేసుకుంటున్నారు. రెండో భాగాన్ని మొదటి భాగం కంటే ఎక్కువ బడ్జెట్‌తో, ఉన్న సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నట్లు టీమ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద సుమారు 600 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించడం, ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకోవడం, కేన్స్ సహా పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సావాల్లో ప్రదర్శితమవ్వడం, పలు ఇతర దేశాల్లోనూ కలెక్షన్స్ పరంగా సత్తా చాటడం.. ఇలా ఒక తెలుగు సినిమా ఎప్పుడూ చూడని ఎన్నో ఘనతలను సాధించిన ‘బాహుబలి’, ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 123తెలుగు తరపున టీమ్‌కు శుభాకాంక్షలు. ‘బాహుబలి 2’తో రాజమౌళి టీమ్ ఈ రికార్డులన్నింటినీ తిరగరాయాలని కోరుకుందాం.

Exit mobile version