హీరోగా ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయి అద్భుతమైన రెండో ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయన ‘లెజెండ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ లాంటి సూపర్ హిట్ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్-సుకుమార్‌ల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులోనే కాక ఆయనకు తమిళం నుంచి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి.
గతంలో రజనీకాంత్ ‘లింగా’, ‘విక్రమ్’ తాండవం సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించిన జగపతి బాబు తాజాగా మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో జగపతి బాబు ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శింబు, కాథరీన్, తాప్సీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇవేకాక కోలీవుడ్‌లో జగపతికి మరిన్ని ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. జగపతి బాబుకి కోలీవుడ్‌లో వస్తోన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోడానికి ఆయన గతంలో తెలుగులో హీరోగా చేసిన ‘నగరం నిద్రపోయిన వేళ’ అనే సినిమాను తమిళంలోకి ‘థలైపు సైతి’ పేరుతో అనువదించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.


