‘జనతా గ్యారెజ్’ టీజర్ మరో రికార్డు!

21st, July 2016 - 04:46:17 PM

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమా ఎలా ఉండబోతోందో పరిచయం చేస్తూ, కొద్దిరోజుల క్రితం టీమ్ విడుదల చేసిన ఫస్ట్ టీజర్ పెద్ద సంచలనమే సృష్టించింది. తెలుగు సినిమాలో అతి త్వరగా 1 మిలియన్ మార్క్ చేరుకున్న టీజర్‌గా నిలవడమే కాక, ఇప్పటివరకూ ఈ టీజర్ 5 మిలియన్ (50 లక్షల) వ్యూస్ సాధించింది. తెలుగు సినిమాల టీజర్స్ విషయంలో 5 మిలియన్ అనేది చాలా అరుదనే చెప్పాలి. ఇక ఇదే టీజర్‌కు ఇప్పటివరకూ 77 వేల లైక్స్ వచ్చాయి.

ఒక టీజర్‌కు వచ్చిన లైక్స్ పరంగా చూస్తే, ‘జనతా గ్యారెజ్’ టీజర్ కొత్త రికార్డు నెలకొల్పిందనే చెప్పాలి. జనతా గ్యారెజ్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన టీజర్ లైక్స్ పరంగా రెండో స్థానంలో ఉంది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం కూడా జనతా గ్యారెజ్‌కు కనిపిస్తోన్న క్రేజ్‌కు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆడియో విడుదల తేదీని టీమ్ త్వరలోనే ప్రకటించనుంది.