రీ ఎంట్రీ సినిమా విజయంతో థ్రిల్లైన జ్యోతిక!

రీ ఎంట్రీ సినిమా విజయంతో థ్రిల్లైన జ్యోతిక!

Published on May 18, 2015 8:00 PM IST

jyotika
అటు తమిళంలోనే కాక, ఇటు తెలుగులోనూ ‘చంద్రముఖి’తో పాటు ‘ఠాగూర్’, ‘మాస్’, ‘షాక్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు నటి జ్యోతిక. ఆ తర్వాత తమిళ స్టార్ సూర్యను వివాహం చేసుకున్నాక కొన్నాళ్ళ పాటు నటనకు దూరమయ్యారు జ్యోతిక. ఏడేళ్ల విరామం తర్వాత ’36 వయధినిలె’ అనే సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు.

మళయాళంలో హిట్టయిన ‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ’ అనే సినిమాకు తమిళ రీమేకే ఈ ’36 వయధినిలె’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా విడుదలతోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలైన అన్నిచోట్ల నుంచీ సినిమాకు మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. తమ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో సూర్య, జ్యోతికలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

“నేను మళ్ళీ సినిమాల్లో నటిస్తానని అనుకోలేదు. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి థ్రిల్ ఫీలయ్యా. ఇన్నేళ్ళ తర్వాత కూడా నా సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. నాకు ఇంతమంచి సినిమాను అందించిన దర్శకుడు రోషన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు” అంటూ ప్రేక్షకులకు జ్యోతిక ఓ నోట్ పంపారు. ఈ సినిమాలో ఓ మధ్య వయస్కురాలైన మహిళగా జ్యోతిక నటించింది. మహిళను గౌరవించడమనే ఇంటర్నల్ మెసేజ్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఫ్యామిలీస్ నుంచి మంచి స్పందన వస్తోంది.

తాజా వార్తలు