సమీక్ష : కలియుగం పట్టణంలో – రొటీన్ గా సాగే రెగ్యులర్ యాక్షన్ డ్రామా !

సమీక్ష : కలియుగం పట్టణంలో – రొటీన్ గా సాగే రెగ్యులర్ యాక్షన్ డ్రామా !

Published on Mar 29, 2024 6:52 PM IST
Kaliyugam Pattanamlo Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 29, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా, దేవీప్రసాద్ తదితరులు

దర్శకుడు: రమాకాంత్ రెడ్డి

నిర్మాతలు: డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌

సంగీత దర్శకులు: అజయ్ అరసాద

సినిమాటోగ్రాఫర్‌: చరణ్ మాధవనేని

ఎడిటింగ్: గ్యారీ బీహెచ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కలియుగం పట్టణంలో. చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

విజయ్ – సాగర్ (విశ్వ కార్తికేయ) ఇద్దరు కవల పిల్లలు. ఐతే, ఈ ఇద్దరిలో ఒకరు మంచి వారు అయితే, మరొకరు రాక్షసుడు. దీంతో, ‘విజయ్ – సాగర్’ల తండ్రి దేవీప్రసాద్, రాక్షసుడైన తన మరో కొడుకుని మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. పైగా అతన్ని శాశ్వతంగా ఇంటికి దూరంగా ఉంచుతాడు. మంచివాడైన విజయ్ ఎంతో మంచిగా ఉంటాడు. అతని ప్రవర్తన చూసి అతనితో ప్రేమలో పడుతుంది శ్రావణి (ఆయుషి పటేల్). ఇంతకీ, ఈ శ్రావణి ఎవరు ?, ఆమె గతం ఏమిటి ?, ఎందుకు ఆమెకు మగాళ్లు అంటే నచ్చదు ?, ఈ మధ్యలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చిత్రా శుక్లా పాత్ర ఏమిటి ?, చివరకు సాగర్ (విశ్వ కార్తికేయ) ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వ కార్తికేయ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్ లో మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో విశ్వ కార్తికేయ తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన ఆయుషి పటేల్ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది. అలాగే, మరో హీరోయిన్ చిత్రా శుక్లా కూడా ఓ కీలక పాత్రలో చాలా బాగా నటించింది.

రాక్షస ఆలోచనలు ఉన్న సాగర్ పాత్ర సీన్స్, అలాగే, ఫ్లాష్ బ్యాక్ లో అతను చేసిన దారుణాల తాలూకు సీన్స్ బాగున్నాయి. ఇక ఇతర కీలక పాత్రల్లో నటించిన దేవీప్రసాద్ కూడా తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ‘బలగం’ రూపలక్ష్మి, అనీష్ కురువిల్లా కూడా తమ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు రమాకాంత్ రెడ్డి తీసుకున్న కథాంశం, మరియు విశ్వ కార్తికేయ – ఆయుషి పటేల్ పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం చాలా చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సాగుతుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే ఉంటాయి. దీనికితోడు దర్శకుడు రమాకాంత్ సాగర్ పాత్ర చుట్టే రిపీట్ డ్ సన్నివేశాలు పెట్టి సినిమాని నడిపాడు.

అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మెయిన్ గా సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా రాసుకుని ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. అలాగే, ప్రీ క్లైమాక్స్ ను, క్లైమాక్స్ ను ఇంకా బాగా డిజైన్ చేసుకోవాల్సింది. మరి రానున్న ఈ సినిమా సీక్వెల్ లోనైనా ఈ తప్పులు సరిచేసుకుంటారేమో చూడాలి.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. రమాకాంత్ రెడ్డి రచయితగా పూర్తిగా విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే పరంగా అతను అసలు ఆకట్టుకోలేదు. సంగీత దర్శకుడు అజయ్ అరసాద అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ గ్యారీ బీహెచ్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాతలు డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

‘కలియుగం పట్టణంలో’ అంటూ వచ్చిన ఈ డిఫెరెంట్ యాక్షన్ డ్రామాలో డిఫరెంట్ కథాంశంతో పాటు యాక్షన్ సీన్స్ అండ్ ట్విస్ట్ లు బాగున్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా మెప్పించకపోయినా, మెయిన్ కాన్సెప్ట్ అండ్ ట్విస్ట్ లు మాత్రం అలరిస్తాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు