మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ కి మంచి కిక్ ఇచ్చిన సినిమా ‘కిక్’. తన కిక్ కోసం పక్కోడి ప్రాణాలతో పేకాట ఆడుకునే పాత్రలో తెలుగు ప్రేక్షకులకు కిక్ ని పంచిన రవితేజ ఇప్పుడు అదే స్టైల్ లో తన కంఫర్ట్ కోసం పక్కోడికి చుక్కలు చూపించే పాత్రలో రవితేజ చేసిన మూవీ ‘కిక్ 2’. కిక్ లోని రవితేజ – ఇలియానాల వారసుడి కథే ఇది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వేగంగా జరుగుతోంది. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మించాడు. కిక్ 2 విషయంలో కళ్యాణ్ రామ్ చాలా హ్యాపీ గా ఉన్నాడు.
‘ఒక నిర్మాతగా కిక్ 2 విషయంలో సంతృప్తిగా ఉన్నాను. మా బ్యానర్ లో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్ లో ఇదీ ఒకటి. త్వరలోనే రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తాం. కిక్ సినిమాకు మించిన కిక్ ఈ సీక్వెల్ లో లభిస్తుందని’ కళ్యాణ్ రామ్ అన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ అయిన కిక్ 2 ట్రైలర్ మరియు ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్ మ్యూజిక్ అందించాడు.


