
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఒక యాక్టర్ గానే కానే కాకుండా ఇండస్ట్రీలో ఏం తప్పు జరిగినా సూటిగా ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవాడు. కమల్ హాసన్ తాజాగా సెన్సార్ బోర్డ్ పై అటాక్ చేసాడు. కమల్ హాసన్ ఉత్తమ విలన్ ప్రమోషన్స్ లో చేసిన ఓ ప్రెస్ మీట్ లో సెన్సార్ బోర్డు అనేది తన పరిధి మరచిపోయి సినిమాల విషయంలో జోక్యం చేసుకుంటోంది అది సబబు కాదని వ్యాఖ్యానించాడు.
కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వటం ఓ కళాకారుడిగా నా బాధ్యత. కానీ సెన్సార్ బోర్డ్ వాళ్ళు సినిమా వాళ్ళు ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతోంది. ఇలా ఇన్వాల్వ్ అవ్వడం నేను ఒప్పుకోను. కళకారులు చెప్పాలనుకుంటున్న విషయాలకు అడ్డుపడుతున్న సెన్సార్ గురించి ప్రజలకి తెలియజేయాలనే ఇది చెపుతున్నా’ అని అన్నాడు.
కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉత్తమ విలన్’ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విషయంలోనే కమల్ హాసన్ కి సెన్సార్ తో ఇబ్బంది అయినట్టు ఉంది. కమల్ హాసన్ హీరోగానే కాకుండా కథ – స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. కమల్ హాసన్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్స్ గా నటించారు.

