ఈనెల్లోనే హైద్రాబాద్‌లో కమల్ సినిమా షూటింగ్ స్టార్ట్!

ఈనెల్లోనే హైద్రాబాద్‌లో కమల్ సినిమా షూటింగ్ స్టార్ట్!

Published on May 18, 2015 8:28 PM IST

kamal-hassan
సినీ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ప్రతి విషయంలోనూ తన విలక్షణతను చాటుకుంటూ దేశంలోని గొప్ప కళాకారుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు కమల్ హాసన్. కమల్ హాసన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేసి చాలా కాలమే అయింది. గతంలో ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కమల్ చేసిన చివరి స్ట్రైట్ తెలుగు సినిమా ‘ఈనాడు’.

తాజాగా ఆయన మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అన్ని రకాల ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయ్! గతంలో కమల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాజేష్ ఎమ్ సెల్వ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడనున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈనెల్లోనే మొదలుకానుంది.

ఈనెల 24న హైద్రాబాద్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. 20రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక ఆ తర్వాత చెన్నైలో మరో 40రోజుల షెడ్యూల్‌ జరగనుందని తెలియజేశారు. కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. తమిళంలో తూంగవనం (నిద్రపోని అడవి అని అర్థం) పేరును ఖరారు చేయగా, తెలుగు వర్షన్ పేరు ఇంకా ఖరారు కాలేదు.

తాజా వార్తలు