Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : కర్త కర్మ క్రియ – కథాంశం బాగున్నా.. ఆసక్తికరంగా సాగదు

Kartha Karma Kriya movie review

విడుదల తేదీ : నవంబర్ 08, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : వసంత్ సమీర్, సెహర్, కాదాంబరి కిరణ్ , రవి వర్మ, చంద్రమహేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు.

దర్శకత్వం : నాగు గవర

నిర్మాత : చదలవాడ పద్మావతి

సంగీతం : శ్రవణ్ భరద్వాజ్

స్క్రీన్ ప్లే : నాగు గవర

నాగు గవర దర్శకత్వంలో వసంత్ సమీర్, సెహర్ జంటగా నటించిన చిత్రం ‘కర్త క్రియ కర్మ’. కాగా శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ చిత్రం, ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

సిద్దు (వసంత్ సమీర్ ) ఓ సెల్ షాప్ లో సెల్ మెకానిక్ గా వర్క్ చేస్తుంటాడు. కానీ ఎప్పుడూ ఈజీ మనీ సంపాధించాలనే ఆలోచలనతో గడుపుతుంటాడు. ఈ క్రమంలో బైక్ షో రూమ్ లో జాబ్ చేసే మైత్రి (సెహర్) ని చూసి ప్రేమలో పడతాడు. మైత్రిని ఫాలో అవుతూ ఉన్న సమయంలో.. కొన్ని సంఘటనలు అనంతరం మైత్రి, సిద్దు ఫ్రెండ్స్ అవుతారు. అయితే అప్పటికే మైత్రి అక్క దివ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని.. దివ్య చావుకి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోనే మైత్రి ఉందని.. మైత్రి ద్వారానే సిద్ధుకు తెలుస్తోంది. ఈ విషయంలో సిద్దు మైత్రికి సహాయం చేస్తుంటాడు.

ఈ క్రమంలోనే దివ్యలాగానే మరో ఇద్దరు చనిపోతారు. దాంతో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చెయ్యటానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రవివర్మ వస్తాడు. రవివర్మ విచారణలో సాగే కొన్ని నాటకీయ పరిణామాల తరువాత అసలు ఏం తేలింది ? దివ్యతో పాటు మిగిలిన ఇద్దరి ఆత్మహత్యలు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? ఈ కేసులకు సిద్ధు ఏమైనా సంబంధం ఉందా ? ఉంటే ఈ కేసుల్లో సిద్దు ఎలా ఇన్ వాల్వ్ అయి ఉన్నాడు ? చివరకి సిద్దు, మైత్రి కలుస్తారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాలసిందే.

 

ప్లస్ పాయింట్స్ :

హీరోగా మొదటి సినిమా చేస్తోన్న వసంత్ సమీర్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. తన యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిన్ కి, తనకి మధ్య సాగే సన్నివేశాల్లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని వసంత్ సమీర్ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు.

‌హీరోయిన్ సెహర్ తన గ్లామర్ తో తన నటనతో మెప్పించే ప్రయత్నం చేసింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు సీన్ కి అనుగుణంగా లేకపోయినా.. ఆమె తన అందంతో ఆకట్టుకుంటుంది.

అలాగే కథలో మరో కీలక పాత్ర అయిన దివ్య పాత్ర చేసిన నటి కూడా చాలా బాగా నటించింది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె చాలా సెటిల్డ్ గా నటించింది. హీరో ఫ్రెండ్ గా నటించిన రాం ప్రసాద్ తన కామెడీ డైలాగ్ డెలివరీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. కథకు కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా బాగుంది. రవి వర్మ ఇన్వెస్టిగేట్ సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

ఆడవారి పై నేటి సమాజంలో జరుగుతున్న అత్యంత దారుణమైన విషయాన్ని తన సినిమా కాన్సెప్ట్ గా రాసుకున్న దర్శకుడు, ఆ కాన్సెప్ట్ కు తగ్గట్లు కథ కథనాలను మాత్రం ఆసక్తికరంగా రాసుకోవడంలో విఫలమైయ్యాడు.

సినిమాలో బలమైన పాయింట్ కనిపిస్తున్నా, ఆ పాయింట్ ని ఎలివేట్ చేసే క్యారెక్టైజేషన్స్ మాత్రం అంత బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు. కొన్ని కీలక సన్నివేశాలను ఇంకా క్లారిటీగా చూపెడితే బాగుండేది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ తో కూడిన సన్నివేశాలు సరిగ్గా ఎలివేట్ కాలేదు.

పైగా చాలా సన్నివేశాల్లో లాజిక్స్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా సినిమా తీశారా అనిపిస్తోంది. వీటికి తోడు ఇంట్రస్ట్ గా సాగని స్క్రీన్ ప్లే, సినిమా పై ఉన్న ఆసక్తిని నీరుగారుస్తోంది.

ఓవరాల్ గా సినిమా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం కథ కథనాలను చాలా సింపుల్ గా నడిపాడు.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు నాగు గవర స్టోరీ లైన్ మంచిదే తీసుకున్నప్పటికీ, ఆ లైన్ ని ఎలివేట్ చేసే విధంగా స్క్రిప్ట్ ని రాసుకోలేకపోయారు. సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలు సినిమాకి తగ్గట్లుగానే ఉన్నాయి. అయితే ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం సన్నివేశాల అవసరానికి మించి.. అనవసరమైన బిల్డప్ మ్యూజిక్ తో సాగుతుంది.

ఇక కెమెరా బాధ్యతలను నిర్వహించిన దుర్గాకిషోర్ బోయిదాపు కెమెరా వర్క్ పర్వాలేదు. స్టేడియంలో హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకునే సన్నివేశం లాంటి కొన్ని సన్నివేశాల్లో ఆయన పనితనం ఆకట్టుకుంటుంది.

ఎడిటర్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగాలేదు. చాలా చోట్ల స్లో మోషన్ షాట్స్ ను ఆయన మరి స్లో గా కట్ చేసినట్లు అనిపిస్తోంది. నిర్మాత చదలవాడ పద్మావతి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

నాగు గవర దర్శకత్వంలో వసంత్ సమీర్, సెహర్ జంటగా నటించిన చిత్రం ‘కర్త క్రియ కర్మ’. ఈ చిత్రం ఏ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. కాకపోతే సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్ బాగుంది. కానీ, ఆ పాయింట్ కి తగట్లు కథ కథనాలను మాత్రం దర్శకుడు ఆకట్టుకున్నే విధంగా రాసుకోలేకపోయాడు. పైగా సినిమా ఆసాంతం స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :