బిగ్ బాస్ ని వెంటాడుతున్న దర్శకుడు.

Published on Jul 30, 2019 10:06 pm IST

బిగ్ బాస్ మొదలై విజయవంతంగా ఓ వారం పూర్తి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులు ఈ షోకి బాగా కనెక్ట్ అయ్యారు. కింగ్ నాగార్జున కూడా వ్యాఖ్యాతగా తనదైన శైలిలో హౌస్ మేట్స్ ని ఆటపట్టిస్తూ, వారితో ఆడుకుంటూ వారాంతంలో ఆసక్తికరంగా షోని నడిపిస్తున్నారు. తలెత్తిన వివాదాలన్నీ సద్దుమణిగి సక్రమంగా సాగుతున్న తరుణంలో, దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఈ షోని వదిలేలా కనపడటం లేదు.

ఈ షో ప్రారంభానికి ముందే కేతిరెడ్డి బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ కోర్టులో పిటీషన్ కూడా వేయడం జరిగింది. తాజాగా మరో మారు ఆయన బిగ్ బాస్ రియాలిటీ షో కి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది అన్న కేతిరెడ్డి, దేశవ్యాప్తంగా తిరిగి బిగ్ బాస్ షో కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం అన్నారు.

అలాగే హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పైన కూడా ఆయన ఆరోపణలు చేశారు. అన్నమయ్య,రామదాసు వంటి భక్తిరస సినిమాలలో నటించిన ఆయన ఇలాంటి రియాలిటీ షో వ్యాఖ్యాతగా ఎలా వ్యవహరిస్తారంటూ దుయ్యబట్టారు. ఈ షో యువతను పెడదోవ పట్టించేదిగా ఉందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షో పై వ్యతిరేకత ఉన్నప్పటికీ అన్ని భాషలలో ఈ రియాలిటీ షో నిరవధికంగా సాగిపోతుంది.

సంబంధిత సమాచారం :