
ఒకప్పుడు పలు అద్భుతమైన సినిమాలతో దేశవ్యాప్తంగా అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్య కాలంలో తనదైన సినిమా చేయలేకపోయిన వర్మ కెరీర్ దాదాపుగా చివరిదశకు చేరిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కాగా ఆయన అభిమానులు మాత్రం వర్మ ఎప్పుడెప్పుడు తనదైన మార్క్ సినిమా తీస్తాడా? చూసి ఆనందిద్దామా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో వర్మ తన అభిమానులకు తన మార్క్ సినిమాను అందిస్తాడనే ప్రచారం ప్రస్తుతం బాగా జరుగుతోంది.
దక్షిణ భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరుగాంచిన వీరప్పన్ జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని వర్మ కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రలో నటించారు. వీరప్పన్‌ను చంపిన ఓ పోలీస్ కథగా ఈ సినిమా రూపొందింది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేయగా, తాజాగా విడుదలైన మరో కొత్త ట్రైలర్ వర్మ ఈజ్ బ్యాక్ అనే విషయాన్ని బలంగా చాటిచెప్పేట్లు కనబడుతోంది.
నిన్న విడుదలైన కొత్త ట్రైలర్‌తో వర్మ తన పని అయిపోయిందంటూ విమర్శిస్తున్నవారందరికీ సమాధానం ఇచ్చినట్లైంది. రామ్ గోపాల్ వర్మ మార్క్ సన్నివేశాలు అని చెప్పుకునే పలు సన్నివేశాలు కిల్లింగ్ వీరప్పన్ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, నవంబర్ నెలాఖర్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
‘కిల్లింగ్ వీరప్పన్’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

