
విబేధాల కారణంగా విడిపోయిన దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత కోన వెంకట్ మళ్లీ కలిసి పని చేయనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీరిద్దరిని ఒక్కటి చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోయే సినిమాకు గోపి మోహన్ తో కలిసి కోన వెంకట్ కథ, మాటలు అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల నుండి ప్రారంభమవుతుంది. రామ్ చరణ్ సరసన సమంత తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తుంది.
రామ్ చరణ్ కోరిక మేరకు వ్యక్తిగత అభిప్రాయాలను, విబేధాలను పక్కన పెట్టినట్టు బాపట్లలలో ‘కోన & కూచిపూడి రుచులు’ ప్రారంభోత్సవం సందర్భంగా కోన వెంకట్ తెలిపారు. వెంకీ, డీ, రెడీ, దూకుడు, బాద్ షా వంటి విజయవంతమైన సినిమాలు కోన వెంకట్, శ్రీను వైట్ల కలయికలో వచ్చాయి. తర్వాత అభిప్రాయ బేధాలతో విడిపోయారు. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో ప్రకాష్ రాజ్, కృష్ణవంశిలను కలిపిన రామ్ చరణ్, ఇప్పుడు కోన వెంకట్, శ్రీను వైట్లలను ఒక్కటి చేశారు.

