
‘ప్రేమకథా చిత్రమ్’ తో హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ప్రేమ కథా చిత్రమ్ లో సుధీర్ బాబుతో జత కట్టిన నందిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఆర్.చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. హరి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విజయవాడలో జరిగింది.
ముందుగా ఈ చిత్ర టీం ఈ బ్యూటిఫుల్ లవ్ స్టొరీని ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. కానీ తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి నుంచి మార్చికి వాయిదా పడనుందని అంటున్నారు. ఫిబ్రవరి 13న స్టార్ హీరో ఎన్.టి.ఆర్ టెంపర్ మూవీ రిలీజ్ ఉండడం కూడా ఒక కారణం అని అంటున్నారు. మరి ఈ లవ్ స్టొరీని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగ చైతన్య, దగ్గుబాటి రానా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడంలో మంచి విజయం సాదించిన ‘చార్మినార్’ ఈ చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది.

