సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ వచ్చేస్తున్నారు : క్రిష్

krish
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఈ ఇద్దరికీ తెలుగు సినీ పరిశ్రమలో అశేష అభిమానులతో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఈ స్థాయి ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరి కెరీర్లలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన మైలురాయిలాంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. చిరంజీవి చాలాకాలం తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు, ఆయన హీరోగా నటించిన 150వ సినిమా అయిన ‘ఖైదీ నెం. 150’ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతోంది. అదేవిధంగా బాలకృష్ణ హీరోగా నటించిన వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతోంది.

భారీ అంచనాల మధ్యన విడుదలవుతోన్న ఈ రెండు సినిమాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరికీ మైలురాయి సినిమాలు కూడా కావడంతో సాధారణంగానే అభిమానుల మధ్యన పోటీ వాతావరణం కూడా కనిపిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాల్లో ఒకటైన గౌతమిపుత్ర శాతకర్ణి దర్శకుడైన క్రిష్, ఇద్దరు హీరోల అభిమానులకు ఓ సందేశమిచ్చారు. ఇద్దరు లెజెండ్స్ తమ ల్యాండ్‌మార్క్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని, ఇద్దరికీ ఘన స్వాగతం పలకాలని కోరుతున్నానని క్రిష్ అన్నారు. ఖైదీ నిర్మాత రామ్ చరణ్ సైతం రెండు సినిమాలూ విజయం సాధించాలని ఆశించారు.