ఓటీటీ సమీక్ష : కుమారి శ్రీమతి – అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెబ్ సిరీస్

ఓటీటీ సమీక్ష : కుమారి శ్రీమతి – అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వెబ్ సిరీస్

Published on Sep 29, 2023 9:45 PM IST
Kumari Srimati Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 28, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: నిత్యా మీనన్, గౌతమి, తిరువీర్, నిరుపమ్, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, డా. విజయ కృష్ణ నరేష్, మురళీ మోహన్, ఉషా శ్రీ, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు

దర్శకుడు : గొంటేష్ ఉపద్యే

నిర్మాత: స్వప్న సినిమా

సంగీతం: స్టెక్కటో & కమ్రాన్

సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ

ఎడిటర్: సృజన అడుసుమిల్లి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

టాలీవుడ్ లో మంచి క్రేజ్ కలిగిన హీరోయిన్స్ లో ఒకరైన నిత్యామీనన్ తాజాగా ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ కుమారి శ్రీమతి. గొంటేష్ ఉపద్యే తెరకెక్కించిన ఈ సిరీస్ కి అవసరాల శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ని అందించారు. మరి నేడు ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సిరీస్ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

 

రామరాజులంక లో సాగే ఈ కథలో శ్రీమతి (నిత్య మీనన్) మరియు ఆమె బాబాయి అయిన కేశవరావు ( ప్రేమ్ సాగర్) ల మధ్య ఒక తరరాల నాటి ఆస్తికి సంబంధించి ఇది సాగుతుంది. తమ ఇంటిని ఎప్పటికీ అమ్మబోమని తన బాల్యంలో తాతయ్యకు మాట ఇస్తుంది శ్రీమతి. అయితే ఆమె బాబాయి అయిన కేశవరావు ఇల్లు మొత్తం తనదే అని, తన అన్నయ్య ఆ ఆస్థి మొత్తం తనకు రాసి ఇచ్చాడని కోర్ట్ లో దావా వేస్తాడు. అయితే ఆ ఇంటిని వేరొకరికి భారీ మొత్తానికి అమ్మాలని భావించిన కేశవరావు కోర్టు ద్వారా ఆస్థి మొత్తాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటాడు.

అది తరతరాల నాటి ఆస్తి కాబట్టి అతడు దానిని వేరొకరికి అమ్మే అవకాశం లేదని కోర్టు తీర్పు ఇస్తుంది. తమ ఇంటిని శ్రీమతి ఆరు నెలల లోపు అసలు ధరను చెల్లించి దక్కించుకోవచ్చని కోర్టు తెలుపుతుంది. అయితే కొద్దిపాటి జీతానికి పని చేసే శ్రీమతికి అంత ఎక్కువ మొత్తం ఇచ్చి ఆ ఇంటిని దక్కించుకోవడం అసాధ్యం కావడంతో స్నేహితుడైన శ్రీరామ్ (నిరుపమ్) ఆమెకు బిజినెస్ పెట్టమని సలహా ఇస్తాడు. మరి అనంతరం స్నేహితుడి సలహాతో శ్రీమతి బిజినెస్ పెడుతుందా, ఆపై ఏమి జరుగుతుంది. ఇంతకీ చివరికి శ్రీమతి ఆ ఇంటిని గడువు సమయంలోగా దక్కించుకుంటుందా లేదా అనేది సిరీస్ లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ విధంగా వారసత్వపు ఆస్తికి సంబందించిన కాన్సెప్ట్ తో గతంలో పలు సినిమాలు వచ్చాయి, అయితే ఈ సిరీస్ మాత్రం ఆకట్టుకునేలా సాగుతుంది మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది. అలానే ఎమోషనల్ సన్నివేశాలు కూడా మన మనసుని తాకుతాయి. కొన్ని డైలాగులు పాతవే అయినప్పటికీ కూడా ఆకట్టుకుంటాయి, అలానే కామెడీ కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సిరీస్ మహిళలు తల్చుకుంటే స్వయంగా స్వశక్తితో ఎదగగలరు అనే నానుడిని నిజం చేస్తుంది. బిజినెస్ పెట్టాలనే ఆలోచనతో బార్ అండ్ రెస్టారెంట్ స్థానిపించిన శ్రీమతి అనంతరం గ్రామస్థుల నుండి సమస్యలు ఎదుర్కొంటుంది.

అయితే తరువాత వారితో సయోధ్య కుదుర్చుకున్న శ్రీమతి గ్రామస్థుల ఆలోచనలకు తగిన విధంగా బార్ అండ్ రెస్టారెంట్ ని నడపడం ఆకట్టుకుంటుంది. అలానే ఒక నోటెడ్ హీరో చేసిన క్యామియో కూడా బాగుంటుంది. ముఖ్యంగా శ్రీమతి పాత్రలో తనదైన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్, ఎంటర్టైన్మెంట్ తో అందరినీ అలరించారు నిత్యా మీనన్. ఇక సీనియర్ నటి గౌతమి కూడా కీలకమైన పాత్రలో నటించారు. తల్లిగా కూతురి శ్రమను, పట్టుదలను అర్ధం చేసుకుని ముందుకు సాగె పాత్రలో ఆమె ఎంతో ఆకట్టుకున్నారు. ఇక ఒకప్పటి మరొక సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి కూడా బాగా పెర్ఫార్మ్ చేసారు. ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, కథానుసారం అలరించారు. పాటలు కూడా బాగున్నాయి. ఈ సిరీస్ ఓటిటి ఆడియన్స్ ని అలరిస్తుంది మరియు కుటుంబం మొత్తం కూడా హాయిగా చూడవచ్చు.

 

మైనస్ పాయింట్స్ :

 

అయితే ఇందులో రొమాంటిక్ ట్రాక్స్ అంతగా పండలేదు. నిజానికి నిరుపమ్, తిరువీర్ ఇద్దరూ బాగా నటించినప్పటికీ కూడా కొంత ఇంపాక్ట్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. కొన్ని మధ్య ఎపిసోడ్స్ కి వచ్చే సరికి నెరేషన్ స్లోగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ సీన్స్ కూడా వేగంగా సాగినట్లు అనిపిస్తుంది. ఆకట్టుకునే ఎండింగ్ సీన్స్ రాసుకుని ఉంటె ఈ సిరీస్ మరింత బాగా పండేది.

 

సాంకేతికవర్గం :

 

స్టెక్కటో & కమ్రాన్ ఇద్దరూ కూడా సాంగ్స్, బీజీఎమ్ విషయంలో అదరగొట్టారు. ముఖ్యంగా బార్ లో వచ్చే సాంగ్ ఎంతో బాగుంటుంది. ,మోహనకృష్ణ ఫోటోగ్రఫి బాగుంది. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంతో బాగున్నాయి. చాలావరకు ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. శ్రీనివాస్ అవసరాల అందించిన స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ కూడా చక్కగా ఉన్నాయి. తన మార్క్ కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక దర్శకుడు గొంటేష్ ఉపద్యే ఈ సిరీస్ ని ఎంతో నీట్ గా తెరకెక్కించారు. ముఖ్యంగా నటీనటుల నుండి ఆకట్టుకునే నటనని రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని పోర్షన్స్ ఇంకా బాగా రాసుకుని ఉంటె బాగుండేది.

 

తీర్పు :

 

మొత్తంగా కుమారి శ్రీమతి సిరీస్ మహిళా సాధికారత గురించి ఆకట్టుకునే రీతిలో సాగె మంచి కామెడీ సిరీస్ అని చెప్పాలి. కామెడీ పోర్షన్స్ చాలా వరకు ఆకట్టుకున్నాయి. నిత్యా మీనన్ మరియు గౌతమి ల పెర్ఫార్మన్స్ మరియు మంచి వినోదాత్మక సన్నివేశాలు ఉన్నాయి. కానీ ముందుగా చెప్పినట్లుగా, కొన్ని ఎపిసోడ్స్ ని మరింత మెరుగ్గా రాసుకుని ఉండవచ్చు మరియు కొన్ని సమయాల్లో నేరేషన్ స్లో అవుతుంది. అయినప్పటికీ, ఈ వారాంతంలో కుమారి శ్రీమతి చూడదగిన అలరించే సిరీస్ అని చెప్పొచ్చు.

 

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు