జయసుధకు మంచు లక్ష్మి మద్దతు

జయసుధకు మంచు లక్ష్మి మద్దతు

Published on Mar 24, 2015 11:49 PM IST

Lakshmi-Manchu-support-jaya
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు ఈనెల 29న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉపాధ్యక్ష పదవులకు శివకృష్ణ, మంచు లక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా పదవులకు కార్యనిర్వహక ఉపాధ్యక్షుడుగా తనికెళ్ళ భరణి, మా ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా, కార్యదర్శిగా ఆలీ ఎన్నికయ్యారు. అయితే అధ్యక్ష పదవికి మాత్రం ఎన్నిక తెప్పేదిలా లేదు. అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, సహజ నటి జయసుధ ఇద్దరు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో అధ్యక్ష పదవిని ఏకగ్రీవంగానే ఎన్నుకున్నా ఈసారి మాత్రం ఎన్నిక తప్పనిసరైంది.

ప్రస్తుతం మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మురళీ మోహన్ తన పూర్తి మద్దతును జయసుధకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మధ్యాహ్నం ఇదే విషయమై ఒక మీడియా సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటి, నిర్మాత, మా ఉపాధ్యాక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మంచు లక్ష్మి కూడా పాల్గొని జయసుధకు మద్దతు తెలిపారు. మా ఏర్పాటైన క్రమం నుండి ఇప్పటివరకూ జరిగిన కార్యక్రమాలూ, అభివృద్ధి తీరును మీడియా ముందు తెలియజేశారు మురళీమోహన్. ఈ సమావేశంలో ప్రముఖ నటుడు కృష్ణం రాజుతో పాటు మరికొంత మంది నటీనటులు పాల్గొన్నారు. ఇక ఎవరు ఎక్కువ ఓట్లు సాధించి మా అధ్యక్ష పదవిని చేపడతారన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు