
తెలుగు సినీ పరిశ్రమలో కొత్తదనమున్న కథలకు ఎప్పుడూ మంచి ఆదరణే దక్కుతుంది. గతంలో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలు సాధించిన సినిమాలన్నీ ఆ కోవలో వచ్చినవే! తాజాగా ఆ కోవలోనే ఓ సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ‘దొంగాట’ గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్లను రాబడుతోంది. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి స్వయంగా నటించి, నిర్మించిన సినిమాయే ‘దొంగాట’. అడవి శేష్ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తమ సినిమా ఈ స్థాయి విజయం సాధించడం పట్ల లక్ష్మి మంచు తన ఆనందాన్ని పంచుకున్నారు. “నా కెరీర్లో దొంగాట సినిమాయే అతిపెద్ద కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా. సినిమా చూసిన వాళ్ళంతా ఓ మంచి ఎంటర్‌టైనింగ్ సినిమా తీశానని అంటుంటే చాలా హ్యాపీగా ఉంది” అంటూ ఆనందం వ్యక్తం చేశారు మంచు లక్ష్మి.
‘దొంగాట’ సినిమా విషయంలో సెకండాఫ్‌లోని కామెడీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మంచు లక్ష్మి ఒక స్టార్ హీరోయిన్ పాత్రలో కనిపించి బాగా ఆకట్టుకున్నారు. ఆమె యాక్టింగ్‌కు సినీ విశ్లేషకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇవన్నీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్‌గా నిలిస్తే.. నవదీ, సుశాంత్, రానా, నాని, రవితేజ, శింబు, నాగార్జున, మంచు మనోజ్ ఇలా ఇంతమంది హీరోలతో కలిసి చేసిన పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దొంగాట విజయంతో హ్యాపీగా ఉన్న మంచు లక్ష్మి తన తరువాతి ప్రాజెక్టు కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు.

