పవన్ సినిమా సెట్స్‌పైకి వెళ్ళింది కానీ..!

7th, August 2016 - 11:27:34 AM

pawan-shruti
ఎన్నో మార్పులు జరిగిన అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న కొత్త సినిమా మొత్తానికి సెట్స్‌పైకి వెళ్ళింది. మొదట ఈ సినిమాకు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాల్సి ఉండగా, చివరినిమిషంలో ఆయన తప్పుకోవడంతో ఆ తర్వాత డాలీ దర్శకుడిగా ఎంపికయ్యారు. దీంతో సినిమా సెట్స్‌పైకి వెళ్ళడానికి ఆలస్యమవుతూ వచ్చింది. ఇక అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ పక్కాగా పూర్తి చేసిన డాలీ, నిన్ననే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళారు.

ప్రస్తుతం హైద్రాబాద్ పరిసరాల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్, శృతి హాసన్‌లు మాత్రం ఇప్పుడే సెట్స్‌లో జాయిన్ కారట. ప్రస్తుతం ఇతర కీలక పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసే పనిలో టీమ్ పడిపోయింది. పవన్ మూడో వారంలో షూట్‌లో జాయిన్ కానుండగా, నెలాఖర్లో శృతి హాసన్ జాయిన్ అవుతారు. కేవలం ఐదు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి ఫిబ్రవరిలో విడుదల చేయాలని టీమ్ భావిస్తోందట. శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఓ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా ప్రచారం పొందుతోంది.