‘అఖిల్’ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్ఫ్యూజన్ ఏంటి ?
Published on Aug 13, 2016 12:29 pm IST

akhil
కుటుంబ సాంప్రదాయాన్ని మారుస్తూ ఫుల్ లెంగ్త్ మాస్ హీరోగా ఎంట్రీ ఇద్దామనుకున్న అక్కినేని వారసుడు ‘అఖిల్’ కు ‘అఖిల్’ సినిమాతో భారీ నిరుత్సాహం ఎదురైంది. దీంతో అతను తన తరువాతి సినిమాపై చాలా జాగ్రత్త పడ్డాడు. లాంగ్ గ్యాప్ తీసుకుని చాలా కథలు విని చివరకు కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఫేమ్ ‘హను రాఘవపూడి’ తో సినిమాను ఖాయం చేసుకున్నాడు. హను రాఘవపూడి కూడా అఖిల్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సినిమా మొదలు పెట్టడానికి రెడీ అయ్యాడు.

కానీ ఇప్పుడు సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్న సమయానికి ఈ ప్రాజెక్టుపై కొత్త వార్త ఒకటి బయలుదేరింది. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని. అఖిల్ తన తరువాతి సినిమాను తమ ఫ్యామిలీకి ‘మనం’ వంటి గుర్తుండిపోయే క్లాసిక్ ను అందించిన ‘విక్రమ్ కుమార్’ దర్శకత్వంలో చేయబోతున్నాడని, ఇప్పటికే కథాపరంగా చర్చలు పూర్తయ్యాయని, త్వరలో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ నుండి ఇంకా ఎటువంటి సమాచారమూ అందలేదు. కనుక ఈ వార్తా ఎంత వరకూ వాస్తవమో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

 
Like us on Facebook