సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా అన్నిచోట్లా సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సోషల్ మెసేజ్‌ను కమర్షియల్ అంశాలకు జోడించి చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ కాన్ఫిడెంట్‌గా ఉన్న మహేష్, అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. మహేష్ స్వయంగా ప్రమోట్ చేయడంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక విడుదలైన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ మహేష్ సినిమాకు మంచి కలెక్షన్లు తెచ్చిపెట్టడంలో సఫలమయ్యారు.
ఇక చాలా కాలం క్రితమే మహేష్ ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చినా, ఇప్పటివరకూ ‘శ్రీమంతుడు’ టైమ్‌లో కనిపించినంతగా ఎప్పుడూ వరుస ట్వీట్లతో అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేయలేదు. ఇక విడుదలకు ముందు ఏకంగా అభిమానులతో చాట్ సెషన్ కూడా నడిపి, వాళ్ళడిగిన ప్రశ్నలకు సరదా సరదా సమాధానాలిస్తూ వచ్చారు. చాట్ సెషన్ తర్వాత కూడా సినిమాకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకుంటూ మహేష్ సోషల్ మీడియాలో జోరు చూపిస్తున్నారు. ఇక ఈ మధ్యాహ్నం మూడున్నర గంటలకు తన ఫేస్‌బుక్ పేజీలో మహేష్ ఓ చాట్ సెషన్‌ను ప్లాన్ చేశారు. సినిమా విజయం సాధించాక పెట్టిన సెషన్ కావడంతో దీనిపై సర్వత్రా మంచి ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా శ్రీమంతుడు విషయంలో మహేష్ చేపట్టిన సోషల్ మీడియా ప్రమోషన్ యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయి సినిమా విజయంలో మంచి పాత్ర పోషించిందనే చెప్పాలి.
